ట్విస్ట్ ఇన్ ద టేల్.. ‘అ!-2’ ఉంది

ట్విస్ట్ ఇన్ ద టేల్.. ‘అ!-2’ ఉంది

‘అ!’ మూవీ చూసి కొందరేమో చాలా గొప్ప సినిమా.. ఇలాంటి ప్రయత్నం తెలుగులో జరగలేదు.. ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా అన్నారు. ఇంకొందరేమో కొత్తదనం పేరుతో చేసిన వ్యర్థ ప్రయత్నం.. మీనింగ్ లెస్ అంటూ తిట్టిపోశారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ఆశించిన ఫలితం రాకపోగా.. జాతీయ అవార్డుల్లో రెండు పురస్కారాలు అందుకుని ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమాను నిర్మించిన నాని అయితే ఫలితం పట్ల అంత సంతృప్తిగా లేడన్నది చిత్ర వర్గాల సమాచారం. అతను సినిమా పట్ల ఆనందంగా ఉండి ఉంటే.. ఏడాది కిందటే ‘అ!-2’ స్క్రిప్టు రెడీగా ఉన్న నేపథ్యంలో సీక్వెల్ నిర్మించడానికి ముందుకొచ్చేవాడు. ‘అ!’ విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అని ఇటీవల నెటిజన్లు అడిగితే.. ఏడాది కిందటే స్క్రిప్టు పూర్తి చేశానని.. నిర్మాత దొరక్కపోవడం వల్ల ఆ సినిమాను తెరకెక్కించలేకపోయానని చెప్పుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఐతే  కొన్ని రోజులకే అతను ట్విస్ట్ ఇచ్చాడు. సీక్వెల్ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్తుందని సంకేతాలిచ్చాడు. ‘‘గుడ్ న్యూస్.. ‘అ!’ సీక్వెల్‌ తెరమీదికి రాబోతోంది. ప్రస్తుతం ఉన్న నా కమిట్మెంట్లను పూర్తి చేశాక ఈ సినిమా పట్టాలెక్కుతుంది’’ అంటూ ప్రశాంత్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించాడు. ‘అ!’ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అంత మంచి ఫలితం రాకపోయినప్పటికీ ప్రశాంత్‌కు ‘కల్కి’ లాంటి క్రేజీ ప్రాజెక్టు చేసే అవకాశం దక్కింది. కానీ ఆ అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేకపోయాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ప్రశాంత్‌ కెరీర్ ఊపందుకోలేదు.

ప్రశాంత్ ఏదో కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తాడు కానీ.. అవి ప్రేక్షకుల నుంచి సంపూర్ణ ఆమోదం పొందట్లేదు. అతడి మాటలున్న స్థాయిలో సినిమాలుండవనే విమర్శలున్నాయి. మరి ఇప్పుడు తనకు ఏదో ఒక కమిట్మెంట్ అని కాకుండా.. ‘కమిట్మెంట్లు’ ఉన్నట్లుగా చెబుతున్న ఈ దర్శకుడు.. వాటిని పూర్తి చేసి ఎప్పుడు ‘అ-2’ను పట్టాలెక్కిస్తాడో చూడాలి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తాడని ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English