'అల..' చేసినందుకు నో రిగ్రెట్స్

 'అల..' చేసినందుకు నో రిగ్రెట్స్

సంక్రాంతి కానుకగా విడుదలైన 'అల వైకుంటపురములో' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో.. ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అన్నీ బాగున్నా.. లెక్కకు మిక్కిలిగా పేరున్న ఆర్టిస్టుల్ని పెట్టుకుని వాళ్లకు తగ్గ పాత్రల్ని త్రివిక్రమ్ ఇవ్వలేదని.. చాలామంది ప్రతిభను వృథా చేశాడని విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించిన అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్‌కు నిరాశే ఎదురైంది. హీరోగా చేస్తున్న సుశాంత్.. ఈ సినిమా ఒప్పుకున్నాడంటే అతడి పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని అనుకున్నారంతా. కానీ తీరా సినిమా చూస్తే అతడి పాత్ర అంతగా ఎలివేట్ కాలేదు. దాని స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ ఉండటం పట్ల చాలామంది పెదవి విరిచారు. ఐతే ఇదే విషయం ప్రస్తావిస్తే మాత్రం సుశాంత్.. ఆ సినిమా చేయడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని తేల్చేశాడు.

ఈ రోజు ట్విట్టర్లో నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా.. ఒక వ్యక్తి 'అల వైకుంఠపురములో' మూవీలో ప్రాధాన్యం లేని పాత్ర అయినా ఎందుకు ఒప్పుకున్నారని అడిగాడు. దీనికి సుశాంత్ సమాధానం చెబుతూ.. "అల వైకుంఠపురములో సినిమాలో నటించడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఆ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. స్క్రీన్ టైం విషయానికి వస్తే.. భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందంతో పని చేస్తున్నపుడు మనం టీం ప్లేయర్‌గానే ఉండాలి. ఈ సినిమాలో నా సన్నివేశాలు కొన్ని తగ్గించారు. సినిమాలో మిస్సయిన సన్నివేశాలు త్వరలో యూట్యూబ్‌లో రిలీజవుతాయి" అని చెప్పాడు సుశాంత్.

మరి యూట్యూబ్‌లోకి రాబోయే సన్నివేశాల్లో అయినా సుశాంత్ స్పెషాలిటీ కనిపిస్తుందేమో చూడాలి. ఇక హీరోగా సుశాంత్ కెరీర్ విషయానికి వస్తే.. అతను 'ఇచట వాహనములు నిలపరాదు' అనే వెరైటీ మూవీ చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English