వైసీపీకి భ‌య‌ప‌డే.. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఆంధ‌ప్ర‌దేశ్ అధికార వైసీపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్‌పై క‌క్ష్య‌తో ఈ సినిమాకు ఆటంకాలు సృష్టించింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయినా ప‌వ‌న్ త‌న ప‌వ‌ర్ చూపించార‌ని జ‌నసైనికులు చెబుతున్నారు. టికెట్ రేట్ల విష‌యంలో, అద‌న‌పు షో విష‌యంలో భీమ్లానాయ‌క్ చిత్రంపై ప్ర‌భుత్వం క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రించిద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు కూడా వైసీపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్ మీద వ్య‌క్తిగ‌త క‌క్ష్య తీర్చుకుంటుంద‌ని నాగ‌బాబు విమ‌ర్శ‌లు చేశారు. క‌క్ష్య సాధింపు ఆలోచ‌న‌లు ఉంటే మొత్తం సినీ ప‌రిశ్ర‌మ‌పై కాకుండా త‌న‌పై తీర్చుకోవాల‌ని రిప‌బ్లిక్ చిత్ర వేడుక‌లో ప‌వ‌న్ అన్నారని.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అదే చేస్తుంద‌ని నాగ‌బాబు అన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వం ప‌వ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకుంద‌నే విష‌యం భీమ్లానాయ‌క్ చిత్రంతో స్ప‌ష్ట‌మైంద‌ని ఆయ‌న తెలిపారు. సినీ పెద్ద‌లు క‌లిసిన‌ప్పుడు త్వ‌ర‌లోనే కొత్త జీవో తెస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఆ ప‌ని చేయ‌లేద‌ని నాగ‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ఇత‌ర హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు.. ఇలా ఎంతో మంది ఉన్న‌ప్ప‌టికీ వైసీపీకి భ‌య‌ప‌డి ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేద‌ని నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఓ హీరోకు జ‌రుగుతున్న అన్యాయాన్ని చూసి ఇది త‌ప్పు అని ఎవ‌రూ చెప్పక‌పోవ‌డం చాలా బాధ‌క‌ర‌మ‌ని ఆయ‌న చెప్పారు. వాళ్ల భ‌యాలను, బ‌ల‌హీన‌త‌ల‌ను, అభ‌ద్రతాభావాన్ని అర్థం చేసుకున్నామ‌ని నాగ‌బాబు అన్నారు. వాళ్లు మాకు స‌హ‌క‌రించ‌క‌పోయినా ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి ఇలాంటి స‌మ‌స్య వ‌చ్చినా తాము కచ్చితంగా నిల‌బ‌డ‌తామ‌ని నాగ‌బాబు వెల్ల‌డించారు.