ఈ సినిమా సూపర్ హిట్.. అంతే

ఈ సినిమా సూపర్ హిట్.. అంతే

బాలీవుడ్లో చాలా తక్కువ సినిమాలతోనే లెజెండరీ స్టేటస్ అందుకున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్లో ఆయన చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమైందే. హాలీవుడ్లో ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ పార్క్’ లాంటి భారీ చిత్రాల్లో ఇర్ఫాన్ కీలక పాత్రలు పోషించడం విశేషం. ఇర్ఫాన్ ఏదైనా సినిమా చేశాడంటే అందులో ఒక స్టాండర్డ్ కనిపిస్తుంది.

తనకే సొంతమైన నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఇర్ఫాన్.. రెండేళ్ల కిందట అరుదైన క్యాన్సర్ బారిన పడటం.. దాంతో పోరాటం చేయడం.. లండన్లో ఏడాది పాటు ఉండి చికిత్స చేయించుకుని గత ఏడాదే ఇండియాకు రావడం.. వచ్చాక క్యాన్సర్‌తో పోరాడుతూనే ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో నటించడం తెలిసిన సంగతే. ఇంతకుముందు ఇర్ఫాన్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘హిందీ మీడియం’కు ఇది స్పిన్నాఫ్ మూవీ. దీని ట్రైలర్ తాజాగా లాంచ్ అయింది.

నార్త్ ఇండియాలోని ఒక చిన్న టౌన్లో మామూలు జీవితం గడిచే ఒక మధ్య తరగతి వ్యక్తి.. ఫారిన్లో చదువుకోవాలన్న తన కూతురి కలను నెరవేర్చేందుకు ఏం చేశాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. లక్షల్లో ఖర్చు అన్నా అమ్మో అనుకునే వ్యక్తి కూతురిని విదేశాల్లో చదివించడానికి కోటి రూపాయలు అవసరమైతే ఎలా స్పందించాడు.. ఈ షాక్ నుంచి తట్టుకుని కూతురిని ఫారిన్‌కు ఎలా తీసుకెళ్లాడు.. అక్కడ ఎలా మేనేజ్ చేశాడు.. ఆమె కలను ఎలా నిజం చేశాడనే నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇర్ఫాన్ అమాయకమైన నటన, హావభావాలతో ఓ రేంజిలో కామెడీ పండించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా వరకు నవ్విస్తూనే చివర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఉందీ సినిమా.

ట్రైలర్ చూస్తే సినిమా సూపర్ హిట్టవడం గ్యారెంటీ అనిపిస్తోంది. సోషల్ మీడియాలో జనాల తీర్పు కూడా అలాగే ఉంది. హోమి అడంజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంగ్రేజీ మీడియం’ను భవేష్, గౌరవ్ శుక్లా, వినయ్ చావల్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 20న విడుదల కానుంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English