బాలీవుడ్ లెజెండ్.. హార్ట్ టచింగ్ మెసేజ్

బాలీవుడ్ లెజెండ్.. హార్ట్ టచింగ్ మెసేజ్

దేశం గర్వించదగ్గ ఆర్టిస్టుల్లో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. హాలీవుడ్లో ‘లైఫ్ ఆఫ్ పై’, ‘జురాసిక్ వరల్డ్’ లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటించే స్థాయికి ఎదిగాడతను. ఆయన నట కౌశలం గురించి చెప్పడానికి ఎన్నో గొప్ప ఉదాహరణలున్నాయి. చాలా తక్కువ సమయంలో ఇర్ఫాన్ లెజెండరీ స్టేటస్ అందుకున్నాడు. అలాంటి గొప్ప నటుడు రెండేళ్ల కిందట తన అభిమానులకు నివ్వెర పరిచే విషయం చెప్పాడు.

తాను న్యూరోఎండోక్రిన్ అనే అరుదైన క్యాన్సర్ బారిన పడ్డానని.. తాను మృత్యువుతో పోరాడుతున్నానని వెల్లడించాడు. ఈ విషయం చెప్పాక లండన్ వెళ్లిపోయిన ఇర్ఫాన్ ఏడాది పాటు అక్కడే ఉండి చికిత్స చేయించుకున్నాడు. ఒక దశలో ఆయన మృత్యువుతో పోరాడుతున్నాడని.. ప్రాణాలు నిలవకపోవచ్చని వార్తలొచ్చాయి. ఐతే అదృష్టం కొద్దీ ఆ ప్రమాదం తలెత్తలేదు. కొంచెం కోలుకుని గత ఏడాది ద్వితీయార్ధంలో మళ్లీ ఇండియాకు వచ్చాడు ఇర్ఫాన్.

ప్రస్తుతం ఇర్ఫాన్ పూర్తి ఆరోగ్యంగానూ లేడు. అలాగని మరీ ప్రమాదం ఏమీ లేనట్లే ఉంది. కొంచెం కోలుకున్న ఇర్ఫాన్.. మళ్లీ ఓ సినిమా కూడా చేశాడు. అదే.. అంగ్రేజీ మీడియం. ఇంతకుముందు ఇర్ఫాన్ చేసిన కల్ట్ మూవీ ‘హిందీ మీడియం’కు ఇది స్పిన్నాఫ్ మూవీ. ‘హిందీ మీడియం’ దర్శక నిర్మాతలు ఈ సినిమాకు పని చేయడం లేదు. హోమి అడంజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంగ్రేజీ మీడియం’ను భవేష్, గౌరవ్ శుక్లా, వినయ్ చావల్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 20న విడుదల కానుంది. దీని ట్రైలర్ లాంచ్ గురించి వివరిస్తూ ఇర్ఫాన్ ఒక హార్ట్ టచింగ్ మెసేజ్ ఇచ్చాడు.

అంగ్రేజీ మీడియం తన కెరీర్లో స్పెషల్ మూవీ అని.. ఈ సినిమాను ప్రమోట్ చేయాలని ఉందని.. కానీ తన శరీరం అందుకు సహకరించడం లేదని.. తన శరీరంలో అవసరం లేని అతిథి కొలువుదీరిందని.. పరోక్షంగా క్యాన్సర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు ఇర్ఫాన్. అలాగే తనకేం జరిగినా అందరితో పంచుకుంటానన్న ఇర్ఫాన్.. వేదాంత ధోరణిలో మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన సరదాగానే మాట్లాడినా.. క్యాన్సర్‌తో ఆయన పోరాటం తలుచుకుంటే అభిమానులకు కన్నీళ్లొస్తున్నాయి. అనారోగ్యంతోనూ ఇర్ఫాన్ ఈ సినిమా చేయడం గొప్ప విషయమే. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో.. మున్ముందు ఆయన సినిమాలు చేస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English