వరుణ్ సందేశ్ ఆ సినిమాలన్నీ చేసి ఉంటే..

వరుణ్ సందేశ్ ఆ సినిమాలన్నీ చేసి ఉంటే..

'హ్యాపీ డేస్’ సినిమాతో తెలుగు సినిమా తెరపైకి దూసుకొచ్చిన యువ నటుడు వరుణ్ సందేశ్. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దాని తర్వాత అతను చేసిన ‘కొత్త బంగారు లోకం’ కూడా సూపర్ హిట్ అవడంతో వరుణ్ సందేశ్‌కు యూత్‌లో మాంచి ఫాలోయింగ్ వచ్చింది. అవకాశాలు వెల్లువెత్తాయి. అతను స్టార్ అయిపోతాడన్న అంచనాలు కలిగాయి.

కానీ సినిమాల ఎంపికలో వేసిన తప్పటడుగులు వరుణ్ కెరీర్‌ను పక్కదోవ పట్టించాయి. ఎంత వేగంగా పైకి లేచాడో.. అంతే వేగంగా కింద పడ్డాడు. చూస్తుండగానే తెర మరుగైపోయాడు. ఈ మధ్య ‘బిగ్ బాస్’ షోతో వరుణ్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. ఈ షోలో వరుణ్ అసలు వ్యక్తిత్వం అందరికీ తెలిసింది. అతడిపై జనాల్లో సానుకూల అభిప్రాయం వచ్చింది. ఈ పాజిటివిటీ తర్వాత అతను ఆలీ నిర్వహించే టీవీ షోలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా తాను మిస్సయిన మంచి సినిమాల లిస్టు తీశాడు వరుణ్. నానికి మంచి పేరు తెచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’కు ముందు వరుణ్‌నే అడిగారట. ఐతే ఆ విషయం ఇప్పుడు తనకు గుర్తు కూడా లేదని వరుణ్ అన్నాడు. దీని సంగతలా ఉంచితే సూపర్ హిట్లయిన ‘100 పర్సంట్ లవ్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలు తానే చేయాల్సిందని.. కొన్ని కారణాల వల్ల అవి చేజారాయని.. ఇలా తాను మిస్సయిన సినిమాలు మరికొన్ని ఉన్నాయని వరుణ్ చెప్పాడు.

వరుణ్‌కు బాలీవుడ్లో సైతం ఓ మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందట. ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘దోబీ ఘాట్’కు వరుణ్‌ను అడిగారట. ‘హ్యాపీ డేస్’ తర్వాత కిరణ్ ఫోన్ చేయగా.. తనకు హిందీ రాదని చెప్పినా వినకుండా ముంబయికి పిలిపించారని.. ఐతే ఏవో కారణాలతో ఈ సినిమాను వెంటనే పట్టాలెక్కించలేకపోయారని.. దీంతో దాన్నుంచి బయటికి వచ్చేశానని.. కొన్నేళ్ల తర్వాత వేరే వాళ్లతో ఈ సినిమా చేశారని వరుణ్ వెల్లడించాడు. ఐతే వరుణ్ ఈ సినిమాలన్నీ చేసి ఉంటే అతడి కెరీర్ ఏ స్థాయిలో ఉండేదో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English