రేవంతా.. మ‌జాకా.. నిశ్చేష్టులైన అధికారులు..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న ప్ర‌త్యేక‌త‌ను మ‌రోసారి చాటుకున్నారు. త‌న ప్ర‌సంగంలో ఎంత వాడి వేడి ఉంటుందో చూపించారు. త‌న‌కు ప‌ద‌వులు ఊరికే రాలేవ‌ని.. త‌న‌కున్న ప్ర‌తిభ ఏమిటో చాటి చెప్పారు. ఆయ‌న‌కున్న స‌బ్జెక్టును ఇంకోసారి బ‌య‌ట‌పెట్టి అధికారుల‌ను నిశ్చేష్టుల‌ను చేశారు.  2022-23 సంవ‌త్స‌రానికిగాను రూ.6831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాల‌ని విద్యుత్ పంపిణీ సంస్థ‌లు స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌ల‌పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి శుక్ర‌వారం బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టింది. దీనికి హాజ‌రైన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యాన్ని ఎండ‌గ‌ట్టారు. డిస్కంల న‌ష్టాల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు.

డిస్కంల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే పెద్ద వినియోగ‌దార‌ని.. విద్యుత్ వినియోగంలో ప్ర‌భుత్వ వాటాయే 30 శాతం అని తెలిపారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం ఏటా రూ.16 వేల కోట్ల స‌బ్సిడీ ఇవ్వాల్సి ఉండ‌గా.. రూ.5652 కోట్లు మాత్ర‌మే ఇస్తోంద‌న్నారు. దీని ద్వారా ఏటా రూ.10 వేల కోట్ల బ‌కాయి ప‌డుతూ డిస్కంలు దివాలా తీసేందుకు కార‌ణ‌మ‌వుతోంద‌న్నారు. దీనికి బాధ్యులైన రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెట్టాల‌న్నారు.

2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత డిస్కంల అప్పులు రూ.11 వేల కోట్లు ఉన్నాయ‌ని.. అందులో ఉద‌య్ ఒప్పందం కింద రూ.8934 కోట్ల‌ను ప్ర‌భుత్వం బ‌ద‌లాయించుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. అపుడు డిస్కంల‌కు న‌ష్టాలు రూ.2 వేల కోట్లు మాత్ర‌మే ఉంటే రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల ఇపుడు రూ.60 వేల కోట్ల‌కు చేరాయ‌ని ఆరోపించారు. రాజ‌కీయ పార్టీల హామీల‌ను అమ‌లు చేసే క్ర‌మంలోనే డిస్కంలు కుప్ప‌కూలాయ‌ని తెలిపారు. ఈ న‌ష్టాల‌ను భ‌రించేందుకు ప్ర‌జ‌ల నుంచి రూ.10 వేల కోట్లు వ‌సూలు చేసేందుకు చార్జీల పెంపును ప్ర‌తిపాదిస్తున్నార‌ని ఆరోపించారు.

ఈ స‌మావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు, విద్యుత్ నిపుణులు, ప్ర‌భుత్వ అధికారులు, సామాజిక ఉద్య‌మ‌కారులు, ప్ర‌జ‌లు, రైతులు పాల్గొన్నారు. అయితే అంద‌రి ప్ర‌సంగాల‌తో పోలిస్తే రేవంత్ స్పీచ్‌ ఆక‌ట్టుకుంద‌ని అక్క‌డికి హాజ‌రైన వారు తెలిపారు. అక్క‌డున్న అంద‌రూ రేవంత్‌ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా విన్నార‌ట‌. ఒక ద‌శ‌లో ఆ స‌మావేశాన్ని రేవంత్ హైజాగ్ చేశార‌ట‌. స‌మ‌గ్ర వివ‌రాల‌తో.. బాగా స్ట‌డీ చేసి డాక్యుమెంట్ల‌తో వ‌చ్చి అధికారుల‌ను నిల‌దీశార‌ట‌. ఈ అంశం రేవంత్‌కు, పార్టీకి లాభించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నారు.