ట్రోలర్లకు దేవరకొండ సమాధానమిది

ట్రోలర్లకు దేవరకొండ సమాధానమిది

టాలీవుడ్లో ట్రోలర్లకు కావాల్సినంత కంటెంట్ ఇచ్చే హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకడు. ఈ తరం యువతకు ప్రతినిధిగా కనిపించే విజయ్.. మాటల్లో అయినా, చేతల్లో అయినా తనదైన యాటిట్యూడ్ చూపిస్తాడు. అతను ఏం చేసినా రొటీన్‌కు భిన్నంగానే చేస్తాడు. ఈ క్రమంలో అతడికి ప్రశంసలూ దక్కుతుంటాయి. అలాగే విమర్శలూ వస్తుంటాయి.

ట్రోలర్స్ ఎప్పుడూ అతడి మీద ఒక కన్నేసి ఉంచుతుంటారు. అతనేం మాట్లాడినా, ఏ పని చేసినా.. దాని మీద మీమ్స్ రెడీ చేసేస్తుంటారు. ఈ మధ్య విజయ్ పింక్ డ్రెస్‌లో ఒక వెరైటీ ఫొటో షూట్ చేస్తే.. అందులో ఒక ఫొటో పట్టుకుని ఎన్ని మీమ్స్ వేశారో లెక్కలేదు. ఐతే ఇలాంటివన్నీ విజయ్ దృష్టికి వెళ్లకుండా ఎలా ఉంటాయి. ఈ ట్రోల్స్, మీమ్స్ గురించి 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రమోషన్ల సందర్భంగా మీడియా వాళ్లు అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు విజయ్.

ఈ ట్రోల్స్, మీమ్స్‌ను తాను చాలా ఇష్టపడతానని.. ఎంజాయ్ చేస్తానని విజయ్ చెప్పాడు. ఇలా చేసే వాళ్లను కూడా తాను ఇష్టపడతానన్నాడు. తన మీద వాళ్లకు ఎంత ఇష్టం లేకపోతే.. గంటలు గంటలు శ్రమించి తన మీద ట్రోల్స్, మీమ్స్ వేస్తారని అన్నాడు విజయ్. ఇలాంటివి చూసినపుడు మనల్ని మనం రివ్యూ చేసుకున్నట్లు ఉంటుందని.. తన మీద నిర్మాణాత్మక విమర్శలు చేస్తే వాటిని స్వీకరిస్తానని.. అలా కాని వాటిని పట్టించుకోనని విజయ్ తెలిపాడు.

ఇక యువతపై తన ప్రభావం గురించి విజయ్ మాట్లాడుతూ.. యువత ధైర్యంగా ఏ పనైనా చేయాలి, భయం లేకుండా మాట్లాడాలి అన్నది తన ఆలోచన అని.. ఆ దిశగా వాళ్లను మోటివేట్ చేసేలా తన చర్యలు ఉంటాయని.. తాను ఒక తరాన్ని మార్చగలనని నమ్ముతున్నానని.. రేప్పొద్దున విజయ్‌ను చూసి మా వాడు ధైర్యంగా మాట్లాడటం నేర్చుకున్నాడని తల్లిదండ్రులు అంటే అంతకంటే తనకు వేరే ఆనందం లేదని విజయ్ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English