భీమ్లా నాయ‌క్ : బొత్స‌తో ప‌వ‌న్ కు చెడిందా?

మెగా ఫ్యామిలీతో ఎంతో స‌న్నిహితంగా మెలిగే మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ నిన్న‌టి వేళ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకోవాల్సింద‌ని అన్నారు.ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు,టికెట్ ధ‌ర‌లు న‌చ్చ‌క‌పోతే సినిమా విడుద‌ల‌నే వాయిదా వేసుకోవాల్సింద‌ని, తాము చ‌ట్ట‌ప్ర‌కార‌మే ముందుకు వెళ్తామ‌ని అన్నారు.ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు మ‌రింత చ‌ర్చ‌కు తావిస్తున్నాయి.ఎందుకంటే బొత్స‌కూ,ప‌వ‌న్ కూ మంచి అనుబంధం ఉంది.ఎప్పుడో కానీ బొత్స మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్ గురించి మాట్లాడ‌రు.కానీ ఈ సారి ఎందుక‌నో ఆయ‌న మీడియా ముఖంగా కొన్నిమాట‌లు చెప్పి వెళ్లారు.

వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో త‌న‌కంటూ ఓ పార్టీని స్థాపించి అందులో చిరులాంటి పెద్ద‌ల‌ను (కాపు కుల పెద్ద‌ల‌ను) ఇన్వాల్వ్ చేయాల‌ని భావిస్తున్నారు.కానీ బొత్స ఎందుక‌నో పార్టీ స్థాపించే ధైర్యం చేయ‌లేక‌పోయారు.ప్ర‌జారాజ్యం పార్టీ స‌మయంలో కూడా బొత్స కు సంబంధించి కొంత మంది పీఆర్పీలో చేరుతారు అన్న వాద‌న కూడా వ‌చ్చింది.అప్ప‌టికీ వైఎస్ హ‌వా ఉండ‌డంతో బొత్స ఆ సాహ‌సం చేయ‌లేక‌పోయారు. త‌రువాత కాలంలో ప‌వ‌న్ త‌న త‌రుఫున జ‌నసేన‌ను ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ ఎందుకనో ఈ సారి కూడా అటువైపు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.

రాజ‌కీయంగా మ‌నుగ‌డ లేని కార‌ణం ఒక‌టి ఉత్ప‌న్నం అయిన‌ప్పుడు మాత్ర‌మే పార్టీ మారాల‌న్నది ఆయ‌న ఆలోచ‌న.కానీ కొన్ని సంద‌ర్భాల్లో వైసీపీ లో త‌న మాట చెల్ల‌క‌పోయినా ఇక్క‌డే ఆయ‌న ఉండిపోతున్నారు. పెద్ద‌గా జ‌గ‌న్ కు ఎదురెళ్లే సాహ‌సం కూడా చేయ‌డంలేదు. పోనీ ఆ రోజు ఏవైనా కేసులు ఎదుర్కొన్నారా అంటే అదీ లేదు.అయితే తాను పార్టీ మారితే ప్ర‌త్యర్థులు ఇంకా పెరిగిపోతారు అన్న భ‌యం కూడా బొత్స‌కు ఉంది.అందుకే ఆయ‌న కొత్త శ‌త్రువుల త‌యారీకి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డం లేదు.

కొన్ని భ‌యాల నేప‌థ్యంలోనో లేదా అభ‌ద్ర‌త‌కు సంకేతం ఇచ్చే ప‌రిణామాల నేప‌థ్యంలోనో ప‌వ‌న్ ను ఉద్దేశించి నాలుగు మాట‌లు  చెప్పి ఉండ‌వ‌చ్చేమో కానీ ఫ‌క్తు చిరంజీవి భ‌క్తుడిగా పేరున్న బొత్స వ్యాఖ్య‌లు కేవ‌లం అధిష్టానం ఆదేశానుసారం చేసిన‌వే అని ఇంకొందరు రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ఒక‌వేళ వైసీపీతో చెడితే ప‌వ‌న్ గూటికి చేరే అవ‌కాశాల‌ను మాత్రం అంత సులువుగా కొట్టిపారేయ‌లేం.ఏపీలో కాపులు మ‌రో పార్టీ పెట్టినా కూడా తాను వెళ్ల‌న‌ని కూడా బొత్స కొన్ని సార్లు పైకి చెప్పినా కూడా త‌న ప్రాబ‌ల్యంతో ఐదు జిల్లాల‌ను శాసించే శ‌క్తిగా అవ‌త‌రించేందుకు ఉన్న ఏ చిన్న పాటి అవ‌కాశాన్ని కూడా బొత్స వ‌ద్ద‌నుకోరు.వ‌దులుకోరు.ఆ విధంగా ఉత్త‌రాంధ్ర‌తో స‌హా బొత్స త‌న‌కు ప‌ట్టున్న తూగో,ప‌గోల‌లో కూడా ఇప్ప‌టికీ రాజ‌కీయం న‌డుపుతూనే ఉన్నారు.కానీ ప‌వ‌న్ పై చేసే వ్యాఖ్య‌లు మాత్రం పూర్తి రాజ‌కీయ సంబంధమైన‌వే అన్న‌ది మాత్రం సుస్ప‌ష్టం. ఎందుకంటే ఇవాళ్టికీ బొత్స‌కూ,మెగా కుటుంబానికీ విడ‌దీయ‌ని అనుబంధం ఉంది. దానిని వ‌ద్ద‌నుకుని, కాద‌నుకుని బొత్స రాజ‌కీయం న‌డ‌ప‌రు.న‌డ‌పేందుకు ఇష్ట‌ప‌డ‌రు కూడా!