తమిళనాట ప్రకంకపనలు రేపుతున్న ఆ సెల్ఫీ

తమిళనాట ప్రకంకపనలు రేపుతున్న ఆ సెల్ఫీ

జయలలిత మరణం దగ్గర్నుంచి తమిళనాట బలపడాలని భారతీయ జనతా పార్టీ చేయని ప్రయత్నం లేదు. అక్కడ రాజకీయాలెప్పుడూ సినీ తారల చుట్టూనే తిరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక పెద్ద స్టార్‌ను తమ పార్టీలోకి చేర్చుకుంటే ఆటోమేటిగ్గా తమిళనాట జెండా ఎగరేయొచ్చన్నది ఆ పార్టీ ప్లాన్. ఇందుకోసం తమిళంలో టాప్-3 స్టార్లు ముగ్గురినీ దువ్వే ప్రయత్నం చేసింది భాజపా.

ఐతే రజనీకాంత్ భాజపాకు పరోక్ష మద్దతుదారుగా ఉంటున్నాడు కానీ.. ఆ పార్టీలో చేరడానికి, అధికారికంగా చేతులు కలపడానికి ఇష్టపడట్లేదన్నది అక్కడి రాజకీయ వర్గాల సమాచారం. అజిత్ కుమార్‌ను సంప్రదిస్తే అతను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని తేల్చేశాడు. ఇక మిగిలిన ఆప్షన్ విజయే. అతను భాజపా వాళ్లతో కలిసి నడిచేందుకు అంగీకరించకపోగా.. ఆ పార్టీ పట్ల తన వ్యతిరేకతను చూపించడం చర్చనీయాంశం అయింది.

మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన డీమానిటైజేషన్, జీఎస్టీ మీద విజయ్ సినిమాల ద్వారానే కాక నేరుగా కూడా కౌంటర్లు వేశాడు. అది మనసులో పెట్టుకుని విజయ్‌ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది భాజపా. తాజాగా అతడిపై ఐటీ దాడులు అందులో భాగమే అంటున్నారు. విజయ్ వైపు తప్పుందా లేదా అన్నది పక్కన పెడితే.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భాజపా అతడి మీదికి ఇన్‌కం ట్యాక్స్ అధికారుల్ని ఉసిగొల్పిందనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ విజయ్ ఏమీ తగ్గట్లేదు. భాజపాను దూకుడుగానే ఎదుర్కోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో తనకున్న జన బలాన్ని అతను చూపించే ప్రయత్నం చేయడం విశేషం.

మామూలుగా విజయ్ షూటింగ్ స్పాట్‌లకు వెళ్లినపుడు అభిమానుల్ని కలవడానికి ఇష్టపడడు. వాళ్లను కలిసినా అది మీడియాలో రావడానికి ఇష్టపడడు. కానీ తాజాగా 'మాస్టర్' సినిమా చిత్రీకరణ సందర్భంగా భారీగా గుమికూడిన అభిమానుల కోసం  ఒక వ్యాన్ ఎక్కి పైన నిలబడి అభివాదం చేయడమే కాదు.. తన కోసం వచ్చిన జనమంతా కనిపించేలా ఒక సెల్ఫీ కూడా తీశాడు. దాన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ కూడా చేశాడు. దీనిపై తమిళ సెలబ్రెటీలే కాక అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ సెల్ఫీ ద్వారా తనకున్న జనబలాన్ని చూపిస్తూ భాజపాకు హెచ్చరికలు జారీ చేయడమే ఉద్దేశమని ప్రచారం సాగుతుండటం విశేషం. ఈ సెల్ఫీ తమిళనాట ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English