హిట్ రిపోర్ట్స్.. రిలీజ్ ఖర్చులకే కష్టమైపోయింది

హిట్ రిపోర్ట్స్.. రిలీజ్ ఖర్చులకే కష్టమైపోయింది

 'జాను' సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బజ్ ఉంది. పైగా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్, రివ్యూలు వచ్చాయి. ఈ రోజుల్లో టాక్ బాగుంటే చాలు కళ్లు మూసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేస్తారు. కానీ 'జాను' చూసేందుకు మాత్రం జనాలు అంతగా ఇష్టపడట్లేదు.

ఆల్రెడీ తమిళ సినిమాను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చూసేయడం వల్లో.. తమిళంతో పోలిస్తే తెలుగులో సినిమా అంత ప్రభావవంతంగా లేదన్న ఫీడ్ బ్యాక్ వల్లో.. సంక్రాంతి సినిమాలు, ఆ తర్వాత వచ్చిన వాటి మీద బాగా ఖర్చు పెట్టేసి ఉండటం వల్లో.. మరేదైనా కారణమో కానీ.. 'జాను'కు వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీకెండ్లోనే అనుకున్న మేర ఆడని ఈ చిత్రం.. ఆ తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వీకెండ్ తర్వాత వసూళ్లు నామమాత్రంగా వస్తున్నాయి. కొన్ని చోట్ల నెగెటివ్ షేర్ కూడా వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం బుకింగ్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి. యుఎస్‌లో అయితే 'జాను' పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి క్లాస్ లవ్ స్టోరీలు ఎగబడి చూసే యుఎస్ ప్రేక్షకులు.. 'జాను' థియేటర్లకు మాత్రం వెళ్లట్లేదు. గురువారం ప్రిమియర్లు కలిపి వీకెండ్లో 2 లక్షల డాలర్లు కూడా వసూలు చేయలేకపోయిందీ సినిమా. 1.6 లక్షల డాలర్ల దగ్గర ఉన్నాయి వసూళ్లు.

ఈ మొత్తం రిలీజ్ ఖర్చులకే సరిపోయేలా ఉంది. యుఎస్ బయ్యర్ మొత్తం పెట్టుబడిని కోల్పోయేలా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బయ్యర్లకు నష్టాలు తప్పట్లేదు. కాకపోతే సినిమాను దిల్ రాజు తక్కువ మొత్తాలకు అమ్మడం.. తన రెగ్యులర్ బయ్యర్లే కావడంతో ఈ నష్టాల్ని మరో సినిమాతో భర్తీ చేసే అవకాశం ఉండట ఊరటనిచ్చే విషయం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English