ప‌వ‌న‌న్న‌కు ప్రాణం ఇస్తాం.. జ‌గ‌న‌న్న‌కు ఓటు వేస్తాం

సినిమాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. సినిమా రంగం నుంచి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ రాజ‌కీయాల్లో రాణిస్తార‌నే గ్యారంటీ ఉండ‌దు. వెండితెర‌పై త‌మ ఆరాధ్య న‌టుడిని చూసి ఈల‌లు వేసే జ‌నం.. ఎన్నిక‌ల్లోనూ ఓట్లు వేస్తేనే ఆ న‌టుడు రాజ‌కీయ నాయ‌కుడు అవుతారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ఇలాగే సినీ రంగం నుంచి వ‌చ్చి గొప్ప నాయ‌కులుగా ఎదిగిన వాళ్లు ఉన్నారు. మ‌రోవైపు ఆ అభిమానం ఓట్లుగా మార‌క‌పోవ‌డంతో దెబ్బ‌తిన్న వాళ్లూ ఉన్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి అలాగే ఉంది. ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీకి కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్ర‌మే ద‌క్కింది. పోటీ చేసిన రెండు చోట్లా ఆయ‌న ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు.

తాజాగా ప‌వ‌న్ చిత్రం భీమ్లానాయ‌క్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఫ్లెక్సీల్లో ప‌వ‌న్‌తో పాటు ఏపీ సీఎం జ‌గ‌న్ ఉండ‌డం.. మ‌రో చోట తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిత్రం ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు అనుస‌రిస్తుంద‌ని ప‌వ‌న్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వం క‌క్ష్య‌పూరితంగానే భీమ్లానాయ‌క్ సినిమా విష‌యం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాంటిది ప‌వ‌న్ సినిమా ఫ్లెక్సీల్లో ఆయ‌న అభిమానులు జ‌గ‌న్ ఫొటో పెట్టారు. పైగా ప‌వ‌న‌న్న‌కు ప్రాణం ఇస్తాం.. జ‌గ‌న‌న్న‌కు ఓటు వేస్తాం అని అభిమానులు ఫ్లెక్సీల‌పై రాయించిన‌ట్లు సామాజిక మాధ్య‌మాల్లో ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో అదే జ‌రిగింది. ప‌వ‌న్‌పై అభిమానం ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయాల ప‌రంగా జ‌గ‌న్‌కే ప్ర‌జ‌లు ఓట్లు వేశారు. అందుకే జ‌గ‌న్ భారీ విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అభిమానులు అదే పంథా అనుస‌రించే వీలుంద‌ని తెలుస్తోంది. అందుకే తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు కేసీఆర్‌కు కృతజ్ఞ‌త‌లు తెలుపుతూ విజ‌య‌వాడలో కృష్ణ‌లంకకు చెందిన ప‌వ‌న్ అభిమానులు హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఆ ఫ్లెక్సీలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఫొటోలున్నాయి. భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల‌ను పుర‌స్క‌రించుకుని టికెట్ల ధ‌ర‌లు, ఇత‌ర అంశాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వ తీరును మెచ్చుకుంటూ అభిమానులు ఇలా చేశారు. భీమ్లానాయ‌క్ సినిమా అయిదో షోకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చిన సంగ‌తి తెలిసిందే. మొత్తానికి ప‌వ‌న్ ఫ్లెక్సీలు రాజ‌కీయ పరంగా చ‌ర్చ‌కు తావిచ్చాయ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.