ఆస్కార్ అవార్డ్స్.. ఈ సినిమా మామూలు సంచలనం కాదు

ఆస్కార్ అవార్డ్స్.. ఈ సినిమా మామూలు సంచలనం కాదు

ప్యారసైట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చల్లో ఉన్న సినిమా ఇది. ప్రపంచ సినీ రంగం మొత్తంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా సాగించిన ఆధిపత్యానికి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇది దక్షిణ కొరియా సినిమా. ఆ దేశం నుంచి ఓ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఇంత వరకు జరగలేదు.

ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో కూడా సౌత్ కొరియా సినిమా ఆస్కార్ అవార్డు సాధించింది లేదు. కానీ ‘ప్యారసైట్’ ఏకంగా హాలీవుడ్ సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి ఉత్తమ చిత్రం అవార్డు గెలిచింది. అంతేనా.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సహా మొత్తం నాలుగు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టింది.

ఓ విదేశీ చిత్రం ఈ స్థాయిలో అవార్డులు కొల్లగొట్టడం అనూహ్యమైన విషయం. ఇంతకుముందు ఇండియా నేపథ్యంగా సాగిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఆస్కార్ అవార్డుల్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. కానీ ఆ సినిమా తీసింది ఒక బ్రిటిష్ దర్శకుడు. ఎక్కువగా అక్కడి టెక్నీషియన్లే ఈ సినిమాలో భాగస్వాములయ్యారు. కానీ ‘ప్యారసైట్’ అలా కాదు. మొత్తంగా దక్షిణ కొరియా టెక్నీషియన్లు, నటీనటులే పని చేశారు. ఈ కథ కూడా అక్కడి నేపథ్యంతో సాగేదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పక్కా లోకల్ మూవీ. కానీ అందులోని ఎమోషన్లు మాత్రం సార్వజనీనమైనవి. ఎవ్వరినైనా కదిలించేవి.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ గొప్ప స్పందన తెచ్చుకుంది. మన దగ్గర కూడా హైదరాబాద్‌లో సబ్ టైటిల్స్‌తో ఆడుతోంది. చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటున్నారు. బలమైన కథ, భావోద్వేగాలతో సినిమా తీస్తే ఒక లోకల్ మూవీ ఎక్కడిదాకా వెళ్తుంది.. ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది అనడానికి ‘ప్యారసైట్’ గొప్ప ఉదాహరణ. మన పరిధి ఇంతే అని ఆలోచించకుండా మన ఫిలిం మేకర్స్ కూడా కన్విక్షన్‌తో సినిమా తీస్తే ప్రపంచ స్థాయికి చేరుతుందని ఇది రుజువు చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English