స‌మంత సార్.. సమంత అంతే

స‌మంత సార్.. సమంత అంతే

చేసింది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కాకపోయినా.. ఒక కథానాయిక తెర మీద కనిపించినపుడు థియేటర్ దద్దరిల్లిందంటే ఆ హీరోయిన్ చాలా స్పెషల్ అని ఒప్పుకోవాల్సిందే. సమంత ఆ కోవకు చెందిన అరుదైన హీరోయినే. గత రెండు మూడేళ్లుగా సమంత ఊపు మామూలుగా లేదు. పెళ్లయిన తర్వాత కథానాయికగా కొనసాగడమే కష్టం అనుకుంటే.. ఆమె కెరీర్లో ఇంతకుముందెన్నడూ చేయని అద్భుతమైన పాత్రలు పోషిస్తూ.. వరుసగా విజయాలందుకుంటూ సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుంటోంది. ఈ మధ్య సమంత ఎంచుకుంటున్న ప్రతి పాత్రా ప్రత్యేకంగా ఉంటుండటంతో ఆమె ఇమేజే మారిపోయింది.

సమంత సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని నమ్మి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. హీరోయిన్లకు ఇలాంటి గుర్తింపు రావడం అరుదు. దీనికి తోడు తెరపై సమంత కనిపిస్తే థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి ఇండస్ట్రీ జనాలు సైతం షాకవుతున్నారు.

గత ఏడాది వచ్చిన 'మజిలీ' సినిమాలో సమంత ఎంట్రీ ఇచ్చేది ఇంటర్వెల్ దగ్గర. ఆమె కోసం ఎదురు చూసే ప్రేక్షకులు.. తను తెరపై కనిపించగానే హర్షాతిరేకాలు చేశారు. ఒక స్టార్ హీరోను చూసినట్లుగా థియేటర్లను హోరెత్తించడం చూసి అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా చెప్పాలంటే ఆ చిత్రంలో నాగచైతన్య కనిపించినప్పటి కంటే సామ్ కనిపించినపుడే ఎక్కువ సందడి కనిపించింది థియేటర్లలో. ఇప్పుడు 'జాను' విషయంలోనూ అదే జరుగుతోంది.

తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న శర్వా కనిపించినప్పటి కంటే సామ్ ఎంట్రీ ఇచ్చినపుడే ఎక్కువ హంగామా కనిపించింది. ఈ చిత్రంలో కూడా సమంత లైన్లోకి రావడానికి టైం పడుతుంది. అరగంటకు పైగా కథ నడిచాకే ఆమె ఎంట్రీ ఇస్తుంది. ఇది ప్యూర్ క్లాస్ మూవీ అయినా సరే.. మల్టీప్లెక్స్ ఆడియన్స్ సైతం రౌజింగ్ రెస్పాన్స్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది చూశాక 'అల వైకుంఠపురములో' బన్నీ లాగా 'సమంత సార్.. సమంత అంతే' అనాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English