రజనీ దెబ్బకు ఆ సంస్థ కుదేలు

రజనీ దెబ్బకు ఆ సంస్థ కుదేలు

లైకా ప్రొడక్షన్స్.. గత దశాబ్ద కాలంలో దక్షిణాది నుంచి వచ్చిన అతి పెద్ద బేనర్లలో ఒకటి. 'కత్తి' సినిమాతో ఈ సంస్థ ఆరంభమైంది. అప్పట్నుంచి లెక్కలు కడితే.. ఇండియాలో మరే సంస్థా దీని స్థాయిలో సినిమాలపై డబ్బులు పెట్టి ఉండదేమో. భారీ చిత్రాలకు పెట్టింది పేరైన ఈ సంస్థ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో (దాదాపు రూ.545 కోట్లు) '2.0' సినిమాను ప్రొడ్యూస్ చేసింది. దీనికి ముందు, తర్వాత కూడా లైకా వాళ్లు భారీ చిత్రాలే తీశారు.

ఐతే రాజీ లేకుండా భారీ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు కానీ.. విజయాలు మాత్రం వరించట్లేదు. 'కత్తి' తర్వాత ఆ స్థాయి సినిమానే లేకపోయింది ఈ బేనర్లో. '2.0' ముందు వరకు ఆ సంస్థ పరిస్థితి బాగానే ఉంది. కానీ శంకర్ అయిన కాడికి ఖర్చు పెట్టించి తీసిన ఈ సిినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఉన్నంతలో బాగానే ఆడినప్పటికీ ఓవర్ కాస్ట్ కావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలొచ్చాయి.

ఈ రజనీ సినిమా పుణ్యమా అని 70-80 కోట్ల దాకా చిల్లు పడినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అది చాలదన్నట్లు ఇప్పుడు వాళ్లకు మరో పంచ్ పడింది. 'దర్బార్' రూపంలో కొత్త ఏడాదిలోనూ షాక్ తగిలింది. రజనీకి ఇచ్చిన భారీ పారితోషకంతో కలిపి సినిమాకు బాగానే ఖర్చయింది. కానీ అనుకున్న మేరకు బిజినెస్ జరగలేదు. పైగా ఇప్పుడు సినిమాకు నష్టాలొచ్చాయంటూ బయ్యర్లు గొడవ చేస్తున్నారు. వాళ్లకు సెటిల్ చేసే విషయంలో లైకా సంస్థ చేతులెత్తేసింది. తమ సినిమాల ట్రాక్ రికార్డును చూపిస్తూ.. తామే భారీ నష్టాల్లో ఉన్నామని.. బయ్యర్ల కోసం ఏమీ చేయలేమని లైకా సంస్థ ప్రకటించింది.

ఈ సంస్థను నడిపిస్తున్న సుభాస్కరన్‌కు వేల కోట్ల వ్యాపారాలున్నాయి కానీ.. ఏ బిజినెస్ మ్యాన్ కూడా నష్టాల్లో ఉన్న ఓ సంస్థలోకి తనకే చెందిన మరో సంస్థ నుంచి నిధులు మళ్లించడు. ఈ నేపథ్యంలో లైకా ఫిలిం ప్రొడక్షన్ డివిజన్ ఇప్పుడు చాలా కష్టాల్లోనే ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వాళ్ల నుంచి భారీ చిత్రాలు ఆశించలేమని.. పరిస్థితి ఇలాగే ఉంటే సినిమాల నిర్మాణం కూడా ఆపేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English