వివేకా హ‌త్య‌.. ఎంపీ అవినాశ్‌రెడ్డి పెద్ద‌నాన్న ఇచ్చిన వాంగ్మూలం ఇదే

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్‌. అవినాశ్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్‌. ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని వివేకా మృతి చెందినట్లు… తన సోదరుడు వై.ఎస్. మనోహర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నరకే తనకు చెప్పారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి అందరికీ చెప్పేశారని అన్నారు. ఆ తర్వాత వివేకానందరెడ్డి ఇంటికి తాను వెళ్లినట్లు చెప్పారు.

వివేకానందరెడ్డి ఇంట్లో బెడ్ రూంలోకి వెళ్ళి చూసేసరికి..అప్పటికే అక్కడ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని చెప్పారు. బెడ్‌మీద, నేలపైన రక్తపుమరకలు ఉన్నాయని… బాత్ రూంలో వివేకా మృతదేహం కనిపించిందని తెలిపారు. అక్కడి పరిస్థితులను చూస్తే గుండెపోటు కాదని… ఏదో జరిగిందనే విషయం గ్రహించానని సీబీఐకి వివరించారు.

అవినాశ్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి దగ్గరుండి పని మనిషితో రక్తపు మరకలను శుభ్రం చేయించినట్లు చెప్పారు. సాక్ష్యాధారాలను ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ శంకరయ్య ప్రశ్నించినా వాళ్ళు పట్టించుకోలేదన్నారు. తనకు గానీ లేదంటే షర్మిల, విజయమ్మల్లో ఒకరికి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకానందరెడ్డి గతంలో అడిగారని ప్రతాప్‌రెడ్డి చెప్పారు. వివేకాకు ప్రజల్లో మంచిపేరు ఉండేదన్న ఆయన… వైఎస్.భాస్కర్‌రెడ్డి కుటుంబం మొదటి నుంచీ ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించేదని సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో తెలిపారు.

మాజీ మంత్రి వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్‌, బెడ్‌రూమ్ లోకి ప్రవేశించింది వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్‌ ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు మృతదేహాన్ని చూసి బయటకు వచ్చాక మిగిలినవారు లోపలికెళ్లారని.. బెడ్‌రూమ్‌లోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (అవినాష్‌రెడ్డి కజిన్‌) తనపై కేకలు వేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు.

వారి రాక ముందే వివేకా మృతదేహానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించానని తెలిపారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.మనోహర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డిలు గదిలో చర్చించుకుంటూ కనిపించార ని తెలిపారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్‌ చుట్టాలంటూ వారు చెప్పారని వెల్లడించారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు  వెలుగుచూశాయి.