‘ఆర్ఆర్ఆర్’ అంటే భయం లేదా?

‘ఆర్ఆర్ఆర్’ అంటే భయం లేదా?

వచ్చే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ ఖరారవ్వగానే టాలీవుడ్లో చాలామంది నిర్మాతల్లో నిరాశ వ్యక్తమైంది. సంక్రాంతికి తమ సినిమాలు షెడ్యూల్ చేసుకుందామనుకున్న వాళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ‘బాహుబలి’కి ఏమాత్రం తగ్గని అంచనాలతో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా మరో పెద్ద సినిమాను రిలీజ్ చేయడం కష్టమే.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే సినిమా, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్ని వచ్చే సంక్రాంతికి అనుకున్నారు కానీ.. అవి వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువ. ఐతే ఈ సినిమాలు వెనక్కి తగ్గినా.. వేరే రెండు చిత్రాలు 2021 సంక్రాంతిని టార్గెట్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తుండటం విశేషం. ఆ రెండూ సంక్రాంతికి సరిగ్గా సరిపోయే ఫ్యామిలీ సినిమాలు అంటున్నారు.

నాలుగేళ్ల కిందట ‘సోగ్గాడే చిన్నినాయనా’తో సంక్రాంతికి భారీ విజయాన్నందుకున్నాడు అక్కినేని నాగార్జున. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా అసాధారణ విజయం సాధించింది. దీనికి ప్రీక్వెల్ చేయాలని నాగార్జున ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. దానికి ‘బంగార్రాజు’ అనే టైటిల్ కూడా ఖరారైంది. అతి త్వరలోనే ఆ సినిమాను మొదలుపెడతారని.. 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని సమాచారం.

‘ఆర్ఆర్ఆర్’ వస్తుందని తెలిసినా.. ఆ చిత్రం రిలీజయ్యేది జనవరి 8న కాబట్టి.. వారం గ్యాప్ ఇచ్చి 15న ‘బంగార్రాజు’ను రిలీజ్ చేస్తే మంచి ఫలితమే వస్తుందని నాగార్జున అనుకుంటున్నాడట. మరోవైపు దిల్ రాజు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడట. గత ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్నందుకున్న ‘ఎఫ్-2’కు సీక్వెల్‌గా తెరకెక్కబోయే ‘ఎఫ్-3’ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో రాజు ఉన్నాడట. బంగార్రాజు, ఎఫ్-3.. వీటిలో ఏదో ఒకటి వచ్చే సంక్రాంతికి రావడం పక్కా అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English