అన్నంత ప‌నీ చేస్తున్న జ‌గ్గారెడ్డి

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అన్నంత ప‌నీ చేస్తున్నారు. పార్టీలో త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని.. అవ‌మానిస్తున్నార‌ని త్వ‌ర‌లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఇటీవ‌ల చెప్పుకొచ్చారు. అధిష్ఠానానికి 15 రోజుల గ‌డువు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ తో త‌న‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించాల‌ని త‌న బాధ‌నంతా వారితో చెప్పుకుంటాన‌ని తెలిపారు. లేదంటే పార్టీని విడిచి పెడ‌తాన‌ని బెదిరిస్తున్నారు.

అయితే.. పార్టీ సీనియ‌ర్లు న‌చ్చ‌చెబుతున్నా జ‌గ్గారెడ్డి త‌న మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. శుక్ర‌వారం త‌న అనుచ‌రుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఇందులో వారి అభిప్రాయాల‌ను సేక‌రించ‌నున్నారు. ఇందులో మెజారిటీ అభిప్రాయాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోనున్నారు. పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టాలా..? లేదా పార్టీలోనే ఉంటూ అన్యాయాన్ని ఎదురించాలా..? ఇత‌ర పార్టీలోకి వెళ్లాళా..? లేదా స్వ‌తంత్రంగా ఉండాలా..? అనే నాలుగు ప్ర‌ధాన అంశాల‌పై త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

జ‌గ్గారెడ్డి విష‌యంలో కొన్ని రోజులుగా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న అధిష్ఠానం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు సీనియ‌ర్ల‌ను పుర‌మాయిస్తోంది. రెండు రోజులుగా భ‌ట్టి విక్ర‌మార్క ఇదే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ప‌లుమార్లు ఆయ‌న‌కు ఫోన్ చేసి న‌చ్చ‌చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయినా జ‌గ్గారెడ్డి మెత్త‌బ‌డ‌లేద‌ట‌. దీంతో గురువారం సీఎల్పీ కార్యాల‌యంలో న‌లుగురు ఎమ్మెల్యేలు భేటీ అయి జ‌గ్గారెడ్డిని శాంత‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేశారు.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఎమ్మెల్యేలు శ్రీ‌ధ‌ర్ బాబు, రాజ‌గోపాలరెడ్డి, మ‌రోసారి జ‌గ్గారెడ్డితో భేటీ అయి ఆయ‌న‌ను కూల్ చేశారు. అయినా కూడా జ‌గ్గారెడ్డి త‌న పంథా మార్చుకోవ‌డం లేద‌ట‌. రాజీనామాకే సిద్ధ‌ప‌డ్డార‌ట‌. పార్టీ కోవ‌ర్టునంటూ సోష‌ల్ మీడియాలో త‌నపై దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. రేవంత్ వ‌ర్గం దీనిని ఖండించ‌డం లేద‌ని.. తాను బ‌య‌ట‌కు వెళితేనే ఆయ‌న‌కు బాగుంటుంద‌ని ఆవేద‌న చెందుతున్నార‌ట‌. అయితే ఈ అంశంపై పార్టీలోని మ‌రో వ‌ర్గం మాత్రం ఆగ్ర‌హంగా ఉన్నార‌ట‌. జ‌గ్గారెడ్డి తీరును త‌ప్పుప‌డుతున్నార‌ట‌.

త‌న అసంతృప్తిని పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో చ‌ర్చించ‌కుండా మీడియాతో పంచుకోవ‌డం వ‌ల్ల పార్టీకి న‌ష్టం జ‌రుగుతోంద‌ని.. ప్ర‌జ‌ల్లో పార్టీ ప‌ట్ల చుల‌క‌న భావం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టాక ఏనాడూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకోని జ‌గ్గారెడ్డి, రాజ‌గోపాలరెడ్డి ఇపుడు అస‌మ్మ‌తి పేరిట గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వారు బ‌య‌ట‌కు వెళ్లిపోయినా పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని.. లాభ‌మో, న‌ష్ట‌మో తామే చూసుకుంటామ‌ని.. మ‌రో వ‌ర్గం తేల్చిచెబుతోంది. చూడాలి మ‌రి జ‌గ్గారెడ్డి విష‌యం ఎంత వ‌ర‌కు వెళుతుందో..!