ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా సీమ రెడ్డి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ `బీమ్లా నాయక్‌` ఓ వైపు విడుద‌ల‌కు స‌ర్వం సిద్ధం చేసుకోగా మ‌రోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువ‌రించడం సంచ‌ల‌నంగా మారింది. టికెట్‌ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్ర‌భుత్వం హెచ్చరికలు జారీ చేయ‌డంపై సినీ వ‌ర్గాలు, ప‌వ‌న్ ఫ్యాన్స్ స్పందిస్తుండ‌గా తాజాగా రాయ‌ల‌సీమ‌కు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రియాక్ట‌య్యారు.

సినిమాలపై సీఎం జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎం టార్గెట్ చేశారని పేర్కొన్న జేసీ ఈ చ‌ర్య‌తో ప‌వ‌న్‌కు న‌ష్టం ఏం ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తుంటే ఏపీ ప్ర‌భుత్వం మాత్రం క‌క్ష గ‌ట్టిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

తాజాగా భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజ‌రై తెలంగాణ‌లో షూటింగ్‌ల కోసం అందుబాటులో ఉన్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకోవాల‌ని కోరిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, ఏపీలో మాత్రం సినిమాల‌ను టార్గెట్ చేసే విధంగా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో పేచీ న‌డుస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు.

భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి సిని ప‌రిశ్ర‌మ‌కు మేలు చేసే చ‌ర్య‌లు కోరారే కానీ ఆయన బతకలేక సీఎం జ‌గ‌న్ దగ్గరకు రాలేద‌న్నారు. సినిమా పరిశ్రమ కోసం చిరంజీవి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డం స‌రైంద‌ని కాద‌ని  జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు.