వెంకీ సరసన రెండో హీరోయిన్ ఎవరంటే..?

వెంకీ సరసన రెండో హీరోయిన్ ఎవరంటే..?

విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రం 'నారప్ప' చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ బ్లాక్ బస్టర్ 'అసురన్'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆ పాత్రకు మలయాళ కుట్టి అమలా పాల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' లాంటి పెద్ద సినిమాల్లో కథానాయికగా నటించిన అమల.. ఆ తర్వాత ఇటు వైపే చూడలేదు. డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పలకరిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటిస్తన్న డైరెక్ట్ మూవీ 'నారప్ప'నే. ఈ చిత్రంలో హీరో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మరదలి పాత్రలో అమల కనిపించనుంది. తమిళంలో ఓ టీనేజీ అమ్మాయి ఈ పాత్రలో కనిపించింది. ఆ క్యారెక్టర్ నిడివి తక్కువే కానీ.. చాలా కీలకంగా ఉంటుంది. హీరో జీవితంలో ఆ పాత్ర పెద్ద విషాదం అవుతుంది. ఆ పాత్రలోనే అమల కనిపించనుంది.

ఐతే మామూలుగా చూస్తే వెంకీ ముందు అమలా చిన్నమ్మాయిలా కనిపిస్తుంది. కానీ సినిమాలో వెంకీ కూడా ఫ్లాష్ బ్యాక్‌‌లో కుర్రాడిలా కనిపించాల్సి ఉంటుంది. మరి ఆ పాత్రకు మేకప్ ఎలా మేనేజ్ చేస్తారో.. అమలకు వెంకీకి జోడీ ఎలా కుదిరేలా చూస్తారో చూడాలి. గత నెలలోనే 'నారప్ప' రెగ్యులర్ షూటింగ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మొదలైంది. మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే సాగే ఈ చిత్రంలో మెజారిటీ సన్నివేశాలు అనంతపురంలోనే తీయబోతున్నారు.

ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం చిత్ర బృందమంతా కలిసి కేరళకు వెళ్లింది. అక్కడ ఆ ఎపిసోడ్ ముగించుకుని తిరిగి అనంతపురం రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 1న రిలీజ్ చేయబోతున్నారు. అంటే షూటింగ్ మొదలైన నాలుగు నెలలకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English