ప్ర‌కంప‌న‌లు రేపుతున్న భీమ్లా నాయ‌క్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అంటేనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జాత‌ర అన్న‌ట్లే ఉంటుంది. అందులోనూ ఆయ‌నో మాస్ సినిమా చేసి.. దానికి మంచి హైప్ వ‌స్తే ఇక ప‌రిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? గ‌త ఏడాది వ‌కీల్ సాబ్ లాంటి క్లాస్ సినిమాకే రిలీజ్ టైంలో హైప్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జ‌రిగాయి. ఇప్పుడిక భీమ్లా నాయ‌క్ లాంటి మాస్ సినిమా మంచి హైప్ మ‌ధ్య రిలీజ‌వుతుండ‌టంతో హంగామా మామూలుగా లేదు.

బుక్ మై షో గొడ‌వ కార‌ణంగా రెండు మూడు రోజులు ఉత్కంఠ న‌డిచింది కానీ.. ఆ స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయి మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి బీఎంఎస్‌లో టికెట్ల అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. ఇంకేముంది? ప‌వ‌న్ అభిమానుల దండ‌యాత్ర మొద‌లైంది బుక్ మై షో మీద‌. ఇలా టికెట్లు పెట్ట‌డం.. అలా హాంఫ‌ట్ అయిపోవ‌డం.. ఇదీ వ‌ర‌స‌. ఏ షోకు కూడా ప‌ది నిమిషాల‌కు మించి స‌మ‌యం ప‌ట్ట‌లేదు టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోవ‌డానికి.

బుక్ మై షోలో భీమ్లా నాయ‌క్ బుకింగ్స్ మొద‌ల‌య్యాయ‌ని చాలామందికి తెలిసేలోపే.. షోల‌కు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాలు, టికెట్ల కోసం ఉన్న డిమాండ్ తెలిసి చాలా చోట్ల టికెట్ల‌ను కొంత‌మేర బ్లాక్ చేసి మిగ‌తావి అందుబాటులో ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

బుక్ మై షోతో గొడ‌వ కార‌ణంగా ఆల్రెడీ రెండు రోజులు థియేట‌ర్ల ద‌గ్గ‌రా అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. ఈ కార‌ణంగా తొలి రోజు షోల‌కు సంబంధించి ఎక్క‌డా ఇప్పుడు టికెట్ ముక్క దొరికే ప‌రిస్థితి లేదు. ఐతే తెలంగాణ‌లో పెద్ద సినిమాల‌కు ఐదో షో ప‌ర్మిష‌న్ లాంఛ‌నంగా మారిపోయిన నేప‌థ్యంలో ప్ర‌తి థియేట‌ర్ల‌లో ఉద‌యం 7-8 గంట‌ల మ‌ధ్య ఒక షో ఉండే అవ‌కాశముంది. ఆ అనుమ‌తులు ఎప్పుడొస్తాయా.. బుకింగ్స్ ఎప్పుడు తెరుస్తారా అని ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు.