జిరాక్స్ కాపీ తీస్తున్న శ్రీకాంత్ అడ్డాల

జిరాక్స్ కాపీ తీస్తున్న శ్రీకాంత్ అడ్డాల

తమిళ బ్లాక్ బస్టర్‌ మూవీ ‘అసురన్’ తెలుగు రీమేక్‌కు శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఎంచుకున్నట్లు వార్త బయటికి వచ్చినపుడు చాలా మందికి నమ్మకం కలగలేదు. చాలా సాఫ్ట్‌గా ఉండే ఫ్యామిలీ సినిమాలు తీసే అడ్డాల ఏంటి.. ‘అసురన్’ లాంటి వయొలెంట్ మూవీని రీమేక్ చేయడమేంటి అంటూ ఈ వార్తను కొట్టిపారేశారు. కానీ తర్వాత అది జస్ట్ రూమర్ కాదని.. నిజమని వెల్లడైంది.

ఐతే ఏ ఉద్దేశంతో అతణ్ని ఈ సినిమాకు ఎంచుకున్నారన్నది అర్థం కాలేదు. శ్రీకాంత్ ట్రాక్ రికార్డెలా ఉంది.. చివరగా అతను తీసిన ‘బ్రహ్మోత్సవం’ పరిస్థితి ఏంటి అన్నది పక్కన పెడితే.. అతను మన నేటివిటీతో ఒరిజినాలిటీ ఉన్న సినిమాలు తీసే ప్రయత్నమే చేశాడు ఇప్పటిదాకా. అలాంటివాడు రీమేక్ చేయడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే. మిగతా దర్శకుల్లాగా రీమేక్ అంటే కాపీ పేస్ట్ చేసే టైపు అతను కాదని.. దీనికి తనదైన టచ్ ఇస్తాడని అంచనా వేశారు జనాలు.

కానీ అనివార్య పరిస్థితుల్లో ‘అసురన్’ రీమేక్‌కు ఒప్పుకున్న అడ్డాల.. ఈ సినిమా విషయంలో తన క్రియేటివిటీ ఏమీ చూపించేలా కనిపించట్లేదు. ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ దించుతున్నట్లే కనిపిస్తున్నాడు. ‘నారప్ప’ ఫస్ట్ లుక్స్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోయింది. సినిమాలో కీలక ఘట్టంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్‌ నుంచి తీసుకున్నది ఈ లుక్ అన్నది స్పష్టం. తమిళంలో ధనుష్ ఆ ఎపిసోడ్లో ఎలాంటి డ్రెస్ వేశాడో.. కలర్‌తో సహా దాన్నే మ్యాచ్ చేస్తూ వెంకీకి గెటప్ వేయించాడు అడ్డాల.

ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో షూటింగ్ జరుగుతున్న చోటి నుంచి లీకైన కొన్ని దృశ్యాల్ని పరిశీలించినా.. తమిళ సినిమాకు అడ్డాల జిరాక్స్ తీస్తున్న సంగతి స్పష్టమైపోతోంది. ఈ సినిమాలో వయొలెన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు హార్ట్ బ్రేకింగ్‌గా అనిపిస్తాయి. అలాంటివి మన ప్రేక్షకులు తట్టుకుంటారా అన్న సందేహాలు కలిగాయి కానీ.. అడ్డాల తీరు చూస్తుంటే వాటిని యథాతథంగా దించేట్లే కనిపిస్తున్నాడు. అవకాశాల్లేని సమయంలో రీమేక్ ఛాన్స్ వచ్చేటప్పటికి ఏమీ ఆలోచించకుండా ఒరిజినల్‌ను ఫాలో అయిపోయి ఫస్ట్ కాపీ తీసివ్వడమే పనిగా పెట్టుకున్నాడతను.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English