అడివి శేష్‌ను చూసి నేర్చుకోండయ్యా

అడివి శేష్‌ను చూసి నేర్చుకోండయ్యా

కథ కొత్తగా ఉన్నంత మాత్రాన సినిమా ఆడేయదు. ఆ కొత్త కథను ఎంత ఆసక్తికరంగా చెప్పామన్నది ముఖ్యం. ఈ నైపుణ్యం అందరికీ ఉండదు. ఐడియాను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే.. రొటీన్ మాస్ సినిమాల కంటే దారుణమైన ఫలితం వస్తుంది. ఇలాంటి ప్రయత్నాల కంటే ఎప్పుడూ చేసే సినిమాలే చేసినా మేలు అనిపిస్తుంది. ఇందుకు టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘డిస్కో రాజా’ ఉదాహరణ.

35 ఏళ్ల ముందు చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోసి మళ్లీ ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే అతడికి ఎదురైన అనుభవాలేంటి అనే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో లాజిక్ గురించి వెతకాల్సిన పని లేదు. ఆ విషయంలో ప్రేక్షకుల్ని దర్శకుడు వీఐ ఆనంద్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కాస్త కన్విన్సింగ్‌గానే ఈ ఐడియాను ఎగ్జిక్యూట్ చేశాడు. ఐతే కథను ఇలా కొత్తగా ఆరంభిస్తే సరిపోతుందా? ఈ పాయింట్‌కు కట్టుబడి కథను నడిపించడం.. చుట్టూ బిగువైన కథనాన్ని అల్లడంలో అతను ఘోరంగా విఫలమయ్యాడు.

మొదట్లో చాలా కొత్తగా అనిపించే ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ తీసుకొస్తుంది. కానీ తర్వాత మొత్తం చల్లబడిపోయేలా సగటు రవితేజ సినిమా చూపించాడు దర్శకుడు. కథ మొదలైన తీరుకు.. ఆ తర్వాత జరిగే వ్యవహారానికి పొంతనే లేదు. దీంతో చివరికి ఒక మామూలు సినిమా చూసిన భావనతో ప్రేక్షకులు బయటికొస్తారు. ఈ విషయంలో ఆనంద్ మాత్రమే కాదు.. దర్శకులందరూ హీరో కమ్ రైటర్ అడివి శేష్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

క్షణం, గూఢచారి, ఎవరు.. అతను హీరోగా నటిస్తూ రచనలో కూడా పాలు పంచుకున్న సినిమాల్ని ఒకసారి పరిశీలిస్తే ఆ సినిమాలన్నీ కథను అనుసరించే సాగుతాయి. ఎక్కడా డీవియేట్ కావు. కథ ఎలా మొదలవుతుందా.. అలాగే నడుస్తుంది. మధ్యలో కమర్షియల్ హంగులని, కామెడీ అని, రొమాన్స్ అని, పాటలని ఫైట్లని మసాలాలు అద్దే ప్రయత్నం ఉండదు. ఏదైనా కథను అనుసరించే నడుస్తుంది. ప్రేక్షకులు ఎక్కడా డీవియేట్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టే అతను చేసిన చిన్న ప్రయత్నాలకు పెద్ద ఫలితం వచ్చింది. కేవలం ఐడియా కొత్తగా ఉంటే సరిపోదని.. దాన్ని ఎంత పకడ్బందీగా చెప్పాలన్నది ముఖ్యం అనడానికి శేష్ సినిమాలే ఉదాహరణ. అతణ్ని చూసి అందరూ నేర్చుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English