అల్లు వారి ‘ప్రైమ్’ వచ్చేసింది

అల్లు వారి ‘ప్రైమ్’ వచ్చేసింది

అల్లు అరవింద్ పాత తరం నిర్మాతే కానీ.. ఆయన ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఈ తరానికి తగ్గట్లే ఆలోచనలు చేస్తుంటారు. ఇప్పటికీ ట్రెండీగా ఉండే సినిమాలు తీస్తూ ఈ తరంలోనూ అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన ఎంత అప్ టు డేట్‌గా ఉంటారనడానికి కొత్తగా మొదలుపెట్టిన బిజినెస్సే నిదర్శనం.

భవిష్యత్తంతా డిజిటల్ మీడియాదే అని అర్థం చేసుకున్న ఆయన.. ‘నెట్ ఫ్లిక్స్’, ‘అమేజాన్ ప్రైమ్’ తరహాలో సొంతంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టనున్నట్లు కొన్ని నెలల కిందటే వెల్లడైన సంగతి తెలిసిందే. అనుకున్నదే ఆలస్యం.. చకచకా ఈ దిశగా సన్నాహాలు చేశారు. తన సొంత సినిమాలకు తోడు వేరే చిత్రాలూ కొనేశారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ నెలకొల్పే దిశగా బ్యాగ్రౌండ్, టెక్నికల్ వర్క్ అంతా కూడా పూర్తయింది. ఈ ఫ్లాట్ ఫామ్ జనాలకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేయడం విశేషం.

‘AHA’ పేరుతో ఈ ఫ్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేశారు. ‘ఆహా’ అనిపించే సినిమాలు ఇందులో ఉంటాయనే సంకేతాలు ఇస్తున్నట్లుంది ఈ పేరు చూస్తే. అలాగే అల్లు అరవింద్ తనయురాలు, బన్నీ కూతురు అయిన అర్హ’ పేరు కూడా కలిసొచ్చేలా ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. మై హోం సంస్థ భాగస్వామ్యంతో అల్లు అరవింద్‌‌తో దీన్ని నెలకొల్పారు. ఇందులో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉన్నాయి.

చిరంజీవి ఆల్ టైం క్లాసిక్ గ్యాంగ్ లీడర్, పవన్ కళ్యాణ్ స్పెషల్ మూవీ ‘బద్రి’, అల్లు అర్జున్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే ‘ఆర్య-2’, రామ్ చరణ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘రచ్చ’.. ఇవి కాక టాలీవుడ్ రీసెంట్ హిట్ ‘అర్జున్ సురవరం’, నిఖిల్ మరో హిట్ ‘కార్తికేయ’.. ఇంకా రఘువరన్ బీటెక్, చందమామ లాంటి హిట్ చిత్రాలు ‘ఆహా’లో ఉన్నాయి. ఆల్రెడీ ప్లే స్టోర్‌లో యాప్ పెట్టేశారు. ఏడాదికి 369 రూపాయలు, మూడు నెలలకు 149 రూపాయల చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టారు. మరి జనాల నుంచి ‘ఆహా’కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English