తెలుగు, తమిళ ఫ్యాన్స్ మధ్య తగువు తీర్చబోయి..

తెలుగు, తమిళ ఫ్యాన్స్ మధ్య తగువు తీర్చబోయి..

తెలుగు వాళ్లకూ బాగానే పరిచయం ఉన్న తమిళ నటుడు సిద్దార్థ్.. ట్విట్టర్లో బాగా యాక్టివ్. వివాదాస్పద అంశాలపై అతను చాలా చురుగ్గా స్పందిస్తుంటాడు. రాజకీయ నేతల్ని, ప్రభుత్వాలు నడిపేవాళ్లను విమర్శించడానికి వెనుకాడడు. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను కూడా బాగా ఫాలో అయ్యే సిద్దార్థ్.. కొన్నిసార్లు అదుపు తప్పి ప్రవర్తించే, మాట్లాడే సినీ అభిమానులకు గడ్డి పెడుతుంటాడు. తాజాగా అతను మరోసారి అదే పని చేశాడు.

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 'అసురన్' రీమేక్ 'నారప్ప' ఫస్ట్ లుక్ చూసి ధనుష్ అభిమానులు కౌంటర్లు వేయడం.. దానికి బదులుగా తెలుగు అభిమానులంతా ఒక్కటై తమిల హీరోల గాలి తీసే ప్రయత్నం చేయడం.. వాళ్లూ అదే స్థాయిలో స్పందించడం.. ఈ నేపథ్యంలో నిన్నట్నుంచి ట్విట్టర్లో ఒక వార్ నడుస్తోంది. #TELUGUREALHEROES అని తెలుగు ఫ్యాన్స్.. #UNRIVALLEDTAMILACTORS అని తమిళ నెటిజన్లు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్విట్టర్లో తెగ కొట్టేసుకుంటున్నారు.

ఇది మరీ తీవ్ర స్థాయికి చేరుతుండటంతో సిద్దార్థ్ స్పందించాడు. తెలుగు, తమిళ అభిమానులు చేస్తున్నదాన్ని పైత్యంగా అభివర్ణించిన సిద్దార్థ్.. యూత్ ఇంటర్నెట్‌ను వృథా చేస్తోందని, దీని బదులు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ గడ్డి పెట్టే ప్రయత్నం చేశాడు. కొన్ని రోజుల ముందు సంక్రాంతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' కలెక్షన్ల గొడవ నడుస్తుండగా.. అవతలి హీరోల్ని కించపరిచేలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి గొడవ పడ్డ మహేష్ బాబు, అల్లు అర్జున్‌ అభిమానులకూ అతను ఇలాగే కౌంటర్లు ఇచ్చాడు. ఐతే ఇలా కౌంటర్లు వేస్తే వినేవాళ్లెవ్వరు? రివర్సులో సిద్దార్థ్‌నే టార్గెట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇటు తెలుగు అభిమానులు, అటు తమిళ ఫ్యాన్స్ ఇద్దరూ కలిసి ఇప్పుడు సిద్ధును ఆటాడుకోవడం మొదలుపెట్టారు. ఇరువురూ అసలు గొడవను పక్కన పెట్టి సిద్ధును ట్రోల్ చేసే పనిలో పడ్డారు. అతడి మీద పెద్ద ఎత్తున మీమ్స్ వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English