‘డిస్కో రాజా’ హిట్టయితే..

‘డిస్కో రాజా’ హిట్టయితే..

మాస్ రాజా రవితేజ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమాగా చెప్పొచ్చు ‘డిస్కో రాజా’ను. గత కొన్నేళ్లలో బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజా ఎలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడో తెలిసిందే. ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలు మాస్ రాజా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి. ‘రాజా ది గ్రేట్’ మినహాయిస్తే గత నాలుగైదేళ్లలో రవితేజ నుంచి ఓ మోస్తరు సినిమా కూడా రాలేదు.

మిగతా స్టార్ హీరోలందరూ కొత్త తరహా కథలు ట్రై చేస్తుంటే రవితేజ మాత్రం మూస, మాస్ సినిమాలు చేస్తూ రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఇలాంటి టైంలో వీఐ ఆనంద్ లాంటి డిఫరెంట్ డైరెక్టర్‌తో అతను చేసిన సినిమా ‘డిస్కో రాజా’. ప్రోమోలు చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా ఉండేలా కనిపిస్తోంది.

‘డిస్కో రాజా’ తన కెరీర్లో అత్యంత ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా అని రవితేజ నొక్కి వక్కాణిస్తున్నాడు. దీని రెండు టీజర్లలోనూ మాస్ రాజా ఎనర్జీ చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ఔట్ పుట్, వీఐ ఆనంద్ పని తీరు విషయంలో ఎంతో సంతృప్తిగా ఉన్న రవితేజ.. ఈ సినిమా అనుకున్నట్లుగా ఆడితే దీనికి సీక్వెలో, ప్రీక్వెలో ఉంటుందని చెప్పడం విశేషం.

‘నేల టిక్కెట్టు’ తీసిన రామ్ తాళ్లూరితోనే ఈ చిత్రం చేసి.. ఆ ఫ్లాప్‌కు బాకీ తీర్చాలని రవితేజ అనుకున్నాడు. తన గత సినిమాల ఫలితాల గురించి పట్టించుకోకుండా బాగా ఖర్చు పెట్టి రిచ్‌గా ఈ సినిమాను నిర్మించిన రామ్‌తోనే ‘డిస్కో రాజా’కు కొనసాగింపుగా సినిమా చేయాలనుకుంటున్నాడు మాస్ రాజా. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డిస్కో రాజా’ అంచనాలకు తగ్గట్లు ఉండి సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌కు పునాది వేస్తుందేమో చూడాలి.

    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English