బంటూ గాడు.. భరత్, చిట్టిబాబులనూ వదిలేలా లేడు

బంటూ గాడు.. భరత్, చిట్టిబాబులనూ వదిలేలా లేడు

ఒక పెద్ద స్టార్.. అంతే పెద్ద డైరెక్టర్ కలిసి సరైన సినిమా చేస్తే.. అది సరైన సీజన్లో రిలీజైతే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత ఎలా ఉంటుందో ‘అల వైకుంఠపురములో’ రుజువు చేస్తోంది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తోందో తెలిసిందే. పండుగ వారమంతా అదరగొట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత కూడా తగ్గట్లేదు. యుఎస్‌లో ఈ సినిమా అంచనాల్ని మించిపోయింది. అల్లు అర్జున్ స్థాయికి 2 మిలియన్ల డాలర్లంటేనే పెద్ద ఫిగర్ అనుకుంటే ఈ చిత్రం ఏకంగా 3 మిలియన్ క్లబ్బునూ అందుకుంది.

త్రివిక్రమ్‌ సినిమాలకు మామూలుగానే అక్కడ మంచి మార్కెట్ ఉంది. ‘అఆ’ సినిమా కేవలం త్రివిక్రమ్ స్టార్ పవర్‌తోనే 2.4 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిందక్కడ. ఇప్పుడు త్రివిక్రమ్‌కు బన్నీ కూడా తోడయ్యాడు. సినిమా అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పైగా మంచి టాక్ తెచ్చుకుంది.

దీంతో ‘అల వైకుంఠపురములో’ యుఎస్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల మోత మోగిస్తోంది. సోమవారం సెలవు (మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే) కావడంతో వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగా వచ్చాయి. మంగళవారం ఎలాగూ ఆఫర్లు ఉంటాయి. కాబట్టి ఈ రెండు రోజులకూ ఢోకా లేదు. ‘డిస్కో రాజా’ యుఎస్‌లో ఏమాత్రం ప్రభావం చూపుతుందన్న సందేహమే. కాబట్టి రాబోయే వీకెండ్లోనూ ‘అల..’కు మంచి వసూళ్లే వచ్చే అవకాశముంది.

కాబట్టి ఈ చిత్రం ఈజీగా 3.5 మిలియన్ మార్కును కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ‘భరత్ అనే నేను’ (3.4 మిలియన్లు), ‘రంగస్థలం’ (3.5 మిలియన్లు) చిత్రాలను దాటేసి ‘అల వైకుంఠపురములో’ టాప్-3 స్థానానికి చేరడం, నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పడం ఖాయమే కావచ్చు. తొలి రెండు స్థానాల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’, ‘బాహుబలి: ది బిగినింగ్’ ఉన్న సంగతి తెలిసిందే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English