త్రివిక్రమ్‌కు కొత్త బిరుదు

త్రివిక్రమ్‌కు కొత్త బిరుదు

టాలీవుడ్లో స్టార్ హీరోలతో పాటు దర్శకులకూ బిరుదులున్నాయి. త్రివిక్రమ్ పేరుకు ముందు అందరూ ‘మాటల మాంత్రికుడు’ అనే మాట తగిలిస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ఇది కేవలం ఆయన సంభాషణల చాతుర్యాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆయనలో దీన్ని మించి అనేక నైపుణ్యాలున్నాయి. అందుకే త్రివిక్రమ్‌ను మాటల మాంత్రికుడు అనే మాటకు పరిమితం చేయడం తగదని అంటున్నాడు నిర్మాత అల్లు అరవింద్. ఈ మాట తనకు తక్కువగా అనిపిస్తూ ఉంటుందని.. తన దృష్టిలో మాత్రం త్రివిక్రమ్ వేరని.. ఆయనకు ‘సెల్యూలాయిడ్ తాంత్రికుడు’ అనే మాట సరిపోతుందని అరవింద్ చెప్పడం విశేషం. తాంత్రికుడు అంటే మాయ చేసేవాడని.. త్రివిక్రమ్ మూడు గంటల పాటు ప్రేక్షకులకు మంత్రం వేసి వాళ్లను కదలకుండా కూర్చోబెట్టగల సమర్థుడని.. కాబట్టి ఆయన్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు అనడం కరెక్ట్ అని అరవింద్ ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ మీట్లో సూత్రీకరించాడు.

ఇక 'అల వైకుంఠపురములో’ సాధించిన విజయం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ఈ స్థాయికి చేరడంలో సంగీత దర్శకుడు తమన్ పాత్ర కీలకమని చెప్పిన అరవింద్.. 2020లో ఈ సినిమా రిలీజైతే.. 2060లో కూడా ఈ సినిమా పాటలు పాడుకుంటారని జోస్యం చెప్పారు. 40 ఏళ్ల ముందు వచ్చిన ‘శంకరాభరణం’ పాటల్ని ఇప్పటికీ పాడుకుంటున్నారని.. ఇంకా ఆపాత మధురాలెన్నో ఇప్పటికే మార్మోగుతున్నాయని.. అలాగే 40 ఏళ్ల తర్వాత ‘అల వైకుంఠపురములో’ పాటల్ని అలాగే పాడుకుంటారనే నమ్మకం తనకు ఉందని.. ఈ రోజుల్లో మీడియా ఎంతో యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో 40 ఏళ్లు కాదు.. ఇంకో వందేళ్లయినా ఈ పాటలు, ఈ సినిమా నిలిచి ఉంటుందని నమ్ముతున్నట్లు అరవింద్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English