చిరుకు కన్నీళ్లు తెప్పించిన యంగ్ హీరో

చిరుకు కన్నీళ్లు తెప్పించిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి ఒక సినీ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న అరుదైన సందర్భం ఇటీవలే చోటు చేసుకుంది. ఆయనలో అంత భావోద్వేగాలు రేకెత్తించిన ఘనత యువ కథానాయకుడు కార్తికేయకే చెందుతుంది. ఈ 'ఆర్ఎక్స్ 100' హీరో ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన జీ సినిమా అవార్డుల కార్యక్రమంలో చాలానే హంగామా చేశాడు.

స్టేజ్ మీద అతను చిరు పాటలకు వేసిన స్టెప్పులు చూసి.. ఆ తర్వాత అతడి మాటలు విని చిరు ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ తరం, ముందు తరం కథానాయకులందరికీ చిరునే ఆదర్శం. హీరోయిజంలో, నటనలో, స్క్రీన్ ప్రెజెన్స్‌లో, డ్యాన్సుల్లో, ఫైట్లలో.. ఎందులో అయినా చిరు స్ఫూర్తిగా నిలుస్తుంటాడు. కార్తికేయ కూడా అందుకు భిన్నం కాదు. చిరును చూసే తాను ఎంతో నేర్చుకున్నానని.. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగానని.. తాను సినిమాల్లోకి రావడానికి ఆయనే ఆదర్శమని చెప్పిన కార్తికేయ.. ఆయనకు ట్రిబ్యూట్‌గా దాదాపు పది పాటలకు డ్యాన్స్ చేయడం విశేషం. చిరు క్లాసిక్ సాంగ్స్ తీసుకుని ఆయన్ని అనుకరిస్తూ స్టెప్పులతో అలరించాడు. ఆ సందర్భంగా ఆడిటోరియం హోరెత్తిపోయింది. ఆ పెర్ఫామెన్స్ అయ్యాక కార్తికేయ చాలా ఉద్వేగంతో మాట్లాడాడు. తన పాతికేళ్ల జీవితంలో ఇవే అత్యుత్తమ క్షణాలన్నాడు. చరణ్ మాత్రమే కాదని.. తామందరం చిరంజీవి పిల్లలమే అంటూ అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి కింద ఉన్న చిరు సైతం ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుని కర్చీఫ్‌తో తుడుచుకోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English