'అల..' వేడుకలో ఆయన్ని స్టేజ్ మీద పిలవంది అందుకా?

'అల..' వేడుకలో ఆయన్ని స్టేజ్ మీద పిలవంది అందుకా?

తెలుగు సినిమాలకు ఒకప్పుడు ఆడియో వేడుకలు జరిగేవి. తర్వాత అవి పక్కకుపోయి ప్రి రిలీజ్ ఈవెంట్లు మొదలయ్యాయి. అప్పట్నుంచి సంగీత దర్శకులు, గాయకులు, గేయ రచయితలకు ఆ వేడుకల్లో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో 'అల వైకుంఠపురములో' సినిమా టీం ప్రి రిలీజ్ ఈవెంట్ కాకుండా సంగీత విభావరి నిర్వహించి ఆ చిత్ర సంగీత దర్శకుడు, గాయకులు, గేయ రచయితల్ని సముచితంగా గౌరవించింది.

దర్శకుడు త్రివిక్రమ్ సహా వేదికపై మాట్లాడిన అందరూ వాళ్లను కొనియాడారు. గాయకులు, గేయ రచయితలందరూ వేదిక మీదికి వచ్చారు. వారిని సత్కరించారు. ఐతే ఈ సినిమాలో 'సిత్తరాల సిరపడు' అనే పాట రాసిన విజయ్ కుమార్‌ను మాత్రం వేదిక మీదికి పిలవలేదు. అసలు సినిమాలో ఆ పాట ఉందన్న సంగతి కూడా జనాలకు అప్పటికి తెలియలేదు.

ఈ విజయ్ కుమార్ ఒడిషాకు చెందినవాడట. ఎల్ఐసీ ఉద్యోగి అట. విధి నిర్వహణలో భాగంగా ఉత్తరాంధ్రలో విస్తృతంగా తిరిగిన విజయ్ కుమార్ అక్కడి జానపదాలపై పట్టు సాధించాడట. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడితో ఆయనకు ఉన్న పరిచయం వల్ల అనుకోకుండా 'సిత్తరాల సిరపడు' పాట రాసే అవకాశం దక్కిందట. ఐతే ఈ పాటను సినిమాలో పెడుతున్నారా లేదా అనే విషయం తేలక విజయ్ కుమార్ టెన్షన్ అనుభవించారట. ఆడియోలో ఈ పాట లేకపోవడంతో ఆయనకు అనుమానం కలిగిందట.

పైగా 'అల..' ఈవెంట్లో తనను వేదిక మీదికి పిలవకపోవడం, ఆ పాట గురించి ప్రస్తావించకపోవడంతో ఇంకా సందేహాలు పెరిగాయట. ఐతే వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయని ఆలోచించి తాను పెద్దగా ఫీలవ్వలేదని.. కానీ సినిమాలో తన పాట కీలకమైన సమయంలో రావడం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం తనకు మహదానందాన్ని కలిగించిందని విజయ్ కుమార్ చెప్పాడు. త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగానే ఈ పాటను సినిమాలో సస్పెన్సుగా దాచి పెట్టారని.. అందుకే తనను మ్యూజికల్ కన్సర్ట్‌లో తనను వేదిక మీదికి పిలవలేదని ఇప్పుడు అర్థమైందని విజయ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English