పూజా హెగ్డేను ఇక ఆపేదెవరు?

పూజా హెగ్డేను ఇక ఆపేదెవరు?

తెలుగులో వరుసగా ఫ్లాపులు వచ్చినపుడే పూజా హెగ్డేను ఎవ్వరూ ఆపలేకపోయారు. ఒక లైలా కోసం, ముకుంద లాంటి ఫ్లాప్ సినిమాలతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత 'మొహెంజదారో' కోసం రెండేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. అయినా సరే.. ఆమె మళ్లీ తెలుగు సినిమాలకు అందుబాటులోకి రాగానే రెడ్ కార్పెట్ పరిచేశారు.

'దువ్వాడ జగన్నాథం' లాంటి పెద్ద చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాని తర్వాత 'సాక్ష్యం'లో నటిస్తే అదీ డిజాస్టరే అయింది. అయినా సరే.. పూజాకు అవకాశాలేమీ ఆగిపోలేదు. పైగా పెద్ద పెద్ద చిత్రాల్లోనే ఛాన్సులొచ్చాయి. ఫ్లాపులొస్తేనే పూజా ఆగలేదంటే ఇక హిట్లు వస్తే ఆమెను ఆపతరమా? ఇప్పుడు పూజా జోరు ఇలాగే ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన చేసిన 'అరవింద సమేత' ఆమె కెరీర్లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరోవైపు 'వాల్మీకి'లో స్పెషల్ రోల్ చేస్తే అదీ హిట్టయి కూర్చుంది. ఆ సినిమాకు పూజా ఎంత ఆకర్షణగా నిలిచిందో తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' చిత్రంతో పలకరించింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. రూ.100 కోట్ల షేర్ అందుకునేలా కనిపిస్తోంది.

కెరీర్లో ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నాక పూజాకు ఇక ఎదురేముంది? సమంత, తమన్నా, కాజల్, అనుష్క, రకుల్ ప్రీత్.. టాలీవుడ్ ఇలా స్టార్ హీరోయిన్లందరూ జోరు తగ్గించేశారు. గ్రౌండ్ ఖాళీగా ఉండగా.. పూజా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేస్తూ నంబర్ వన్ హీరోయిన్‌గా ఏక ఛత్రాధిపత్యం చలాయించబోతున్నట్లే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English