డిస్కో రాజా.. అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన తమన్

డిస్కో రాజా.. అదిరిపోయే అప్ డేట్ ఇచ్చిన తమన్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పుడు కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఒకప్పుడు ఊకదంపుడు సంగీతంతో విసుగెత్తించిన తమన్.. గత రెండు మూడేళ్లుగా ఎంత మంచి పాటలు అందిస్తున్నాడో తెలిసిందే. అందులోనూ ఈ మధ్య తమన్ సంగీతం మరో స్థాయికి చేరింది. సంక్రాంతి సినిమా ‘అల వైకుంఠపురములో’లో పాటలు, నేపథ్య సంగీతం ఎంత అప్లాజ్ తెచ్చుకున్నాయో.. సినిమాకు ఎంత బలమయ్యాయో తెలిసిందే. కొత్త ఏడాదిలో అతడికిది అద్భుత ఆరంభమే.

విశేషం ఏంటంటే.. ‘అల..’ వచ్చిన రెండు వారాల్లోపే తమన్ మరో సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఆ చిత్రమే.. డిస్కో రాజా. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్ వచ్చింది. ఇప్పుడీ చిత్రం నుంచి మరో పాట రాబోతోంది. ఆ పాటకు ఇద్దరు మేల్ సింగర్స్ గాత్రం అందించారు. ఆ ఇద్దరూ చాలా స్పెషలే.

ఈ ఇద్దరిలో ఒకరు రవితేజ కాగా.. ఇంకొకరు లెజెండరీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కావడం విశేషం. రవితేజ పాట పాడటమే ఆశ్చర్యమంటే.. అతడికి డిస్కో కింగ్ బప్పీలహరి తోడవుతుండటం మరింత స్పెషలే. 80లు, 90ల్లో బప్పీలహరి మ్యూజిక్ ఎలా మార్మోగిందో అప్పటి సంగీత ప్రియులకు బాగా తెలుసు. తెలుగులో కూడా ‘రౌడీ అల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాలతో ఒక ఊపు ఊపేశాడు. ఐతే 2000 తర్వాత ఆయనకు సినిమాలు తగ్గిపోయాయి.
తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాడు. ఇంత కాలానికి ఆయన మళ్లీ తెలుగులోకి వస్తుండటం.. అది కూడా గాయకుడిగా కావడం ఆయన అభిమానుల్ని ఎగ్జైట్ చేసేదే. మరి బప్పీతో కలిసి రవితేజ ఎలా సందడి చేస్తాడో చూడాలి. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందించిన ‘డిస్కో రాజా’ జనవరి 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English