వంశీ తర్వాత అనిల్ రిపీట్

వంశీ తర్వాత అనిల్ రిపీట్

ఒక దర్శకుడితో హిట్టు కొడితే.. కచ్చితంగా త్వరగానే ఆ దర్శకుడితో మరో సినిమాను లైన్లో పెడతాడు మహేష్ బాబు. గుణశేఖర్, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, కొరటాల శివ లాంటి దర్శకులను ఇలాగే రిపీట్ చేశాడతను. గత ఏడాది ‘మహర్షి’తో తనకు విజయాన్నందించిన వంశీ పైడిపల్లితోనూ మహేష్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ నటించే చిత్రం వంశీతోనే అన్న సంగతి ఇప్పటికే ఖరారు చేశాడు. దాని తర్వాత మహేష్ చేసే సినిమా విషయంలోనూ క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. ‘సరిలేరు..’లో మహేష్‌ను అభిమానులు మెచ్చేలా చూపించి మాస్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడినే.. వంశీ తర్వాత ఈ హీరోను డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా మహేషే స్వయంగా సంకేతాలు ఇచ్చేశాడు.

‘సరిలేరు..’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ప్రోగ్రాములకు తోడు ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు మహేష్. అందులో భాగంగా అనిల్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు మహేష్. అనిల్ వేరే సినిమా ఒకటి చేశాక తనతో తీస్తాడని అతను చెప్పాడు. అనిల్ ఒక సినిమా తీసేలోపు.. మహేష్ వంశీ పైడిపల్లి సినిమా చేసి రెడీగా ఉంటాడేమో.

‘సరిలేరు..’ తర్వాత అనిల్ ‘ఎఫ్-2’ సీక్వెల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఘట్టమనేని కుటుంబంలో మూడు తరాల హీరోలు (కృష్ణ, మహేష్, గౌతమ్) కలిసి ఎప్పుడు సినిమా చేస్తారని ఓ అభిమాని మహేష్‌ను అడిగితే.. ఆ కలయికలో సినిమా చేయగల సత్తా అనిల్‌కే ఉందని మహేస్ చెప్పడం విశేషం. ఇది అనిల్‌కు చాలా పెద్ద కాంప్లిమెంటే. ‘సరిలేరు’లో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ పాత్రను చూపించి అభిమానుల్ని అలరించిన అనిల్.. మహేష్‌తో చేయబోయే తర్వాతి సినిమాలో కృష్ణ, మహేష్, గౌతమ్‌ ముగ్గురినీ చూపించి అభిమానుల కోరిక తీరుస్తాడేమో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English