అమృతం మళ్లీ వస్తోంది

అమృతం మళ్లీ వస్తోంది

తెలుగు టీవీ ఆడియెన్స్‌పై బలమైన ముద్ర వేసిన సీరియళ్లలో 'అమృతం' ఒకటి. సీరియళ్లంటే ఇలాగే ఉండాలి అనే అభిప్రాయాన్ని తోసిరాజని.. అసలు సీరియళ్లంటే పడని వాళ్లను, సినీ ఆడియెన్స్‌ను కూడా ఇటు వైపు మళ్లించి ఎంటర్టైన్ చేసిన ఘనత 'అమృతం'కే చెందుతుంది. సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఆ సీరియల్ నవ్వించింది. జంధ్యాల సినిమాల్ని తలపించే స్థాయి వినోదంతో అలరించిన ఆ సీరియల్‌ను మన ఆడియెన్స్‌కు అందించింది జస్ట్ ఎల్లో సంస్థ అధినేత గంగరాజు గుణ్ణం.

'లిటిల్ సోల్జర్స్' లాంటి అద్భుతమైన సినిమా తీసిన ఆయన.. ఆ తర్వాత 'అమృతం' సీరియల్‌తో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. చంద్రశేఖర్ యేలేటి సహా ఎంతోమంది ప్రతిభావంతులకు ఈ సీరియల్ లైఫ్ ఇవ్వడం విశేషం. ఏడెనిమిదేళ్ల పాటు సాగిన ఈ సీరియల్ తర్వాత ఆగిపోయింది. అప్పట్నుంచి యూట్యూబ్‌లో అలరిస్తోంది.

యూట్యూబ్‌లో అమృతం ప్రతి ఎపిసోడ్‌కూ మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడీ సీరియల్‌‌కు రెండో భాగం రాబోతుండటం విశేషం. 'అమృతం' అప్పట్లో జెమిని టీవీలో వచ్చేది. ఐతే ఇప్పుడు జీటీవీ వాళ్లు 'అమృతం ద్వితీయం' పేరుతో కొత్త సీరియల్ మొదలుపెట్టబోతున్నారు. గుణ్ణం గంగరాజు సారథ్యంలో ఆయన తనయుడు సందీప్ గుణ్ణం ఈ సీరియల్ బాధ్యతలు చేపట్టనున్నాడట. కొంచెం పెద్ద స్థాయిలోనే ఈసారి ఈ సీరియల్‌కు శ్రీకారం చుట్టనున్నార.

ఐతే అమృతం పాత్రలో శివాజీ రాజా, హర్షవర్ధన్ సహా చాలామంది నటించగా..  సుదీర్ఘ కాలం ఆ పాత్రలో నటించింది హర్షనే. ఇప్పుడు అతను మళ్లీ ఆ పాత్ర చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఐతే ఆంజనేయులు పాత్రలో అద్భుత అభినయం ప్రదర్శించిన గుండు హనుమంతరావు ఇప్పుడు లేరు. ఆయన లేకుంటే సీరియల్‌లో కచ్చితంగా ఏదో వెళితి కనిపిస్తుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English