విజ‌య్ సినిమాల్ని ఎగ‌బ‌డి కొనేస్తున్నారుగా..

విజ‌య్ సినిమాల్ని ఎగ‌బ‌డి కొనేస్తున్నారుగా..

విజయ్ తమిళంలో రెండు దశాబ్దాల ముందు నుంచే పెద్ద స్టార్. ఐతే అతడితో పోలిస్తే చిన్న చిన్న హీరోలు కూడా అనువాద చిత్రాలతో తెలుగులో హిట్లు కొట్టారు. మార్కెట్, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ విజయ్‌కి మాత్రం తెలుగులో చాలా ఏళ్లు సరైన గుర్తింపే రాలేదు. అతడి సినిమాలు ఒక టైంలో తెలుగులో రిలీజే అయ్యేవి కావు. తర్వాత వరుసగా అనువదించడం మొదలుపెట్టినా పెద్దగా స్పందన లేకపోయింది. కానీ 'తుపాకి' దగ్గర్నుంచి పరిస్థితి మారి అతడి సినిమాలకు ఇక్కడ ఆదరణ పెరిగింది.

గత రెండేళ్లలో 'అదిరింది', 'సర్కార్', 'విజిల్' లాంటి సినిమాలతో తెలుగులో విజయ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతడి మార్కెట్ ఇక్కడ పది కోట్లకు చేరిపోవడం విశేషం. దీపావళికి 'విజిల్' తెలుగులో హౌస్ ఫుల్ వసూళ్లతో నడవడం విశేషం. విజయ్ గత మూడు సినిమాల్ని తెలుగులో పేరున్న నిర్మాతలే రిలీజ్ చేశారు. మంచి లాభాలు కూడా అందుకున్నారు.

'విజిల్'తో మంచి ఫలితం అందుకున్న పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు.. ఇక వరుసగా విజయ్ సినిమాల్ని కొనేయాలని ఫిక్సయినట్లున్నాడు. మహేష్‌ను 'విజిల్'ను తెలుగులో ప్రమోట్ చేసి మంచి బజ్ తీసుకురావడం చూసి విజయ్ కూడా బాగానే ఇంప్రెస్ అయినట్లున్నాడు. అతడి తర్వాతి సినిమా 'మాస్టర్' హక్కులు కూడా మహేషే దక్కించుకున్నాడు. మంచి రేటే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్లో రిలీజయ్యే అవకాశముంది. ఆ నెలలో తెలుగులో చాలా సినిమాలున్నప్పటికీ మహేష్ ధీమాగా ఉన్నాడు.

నగరం, ఖైదీ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విజయ్ కెరీర్లో చాలా భిన్నమైందిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడూ మాస్ మసాలా సినిమాలు చేసే విజయ్.. డిఫరెంట్ డైరెక్టర్‌గా పేరున్న లోకేష్‌తో సినిమా తీస్తుండటంతో ఇదెలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఐతే మహేష్ నందమూరి క్యాంప్‌‌కు చెందిన వాడు. అతను రిలీజ్ చేస్తున్న సినిమాకు చిరు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిన సినిమా టైటిల్‌ ఉన్న నేపథ్యంలో మెగా అభిమానులు ఈ సినిమా పట్ల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English