భీమ్లా నాయ‌క్.. బుక్ మై షోలో లేదు

కొత్త సినిమా రిలీజైతే థియేట‌ర్ ద‌గ్గ‌రికెళ్లి క్యూల్లో నిల‌బ‌డి టికెట్లు కొనే రోజులు ఎప్పుడో పోయాయి. బుక్ మై షో స‌హా ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ వ‌చ్చాక క‌న్వేయ‌న్స్ ఫీజు చెల్లించి సింపుల్‌గా టికెట్ బుక్ చేసుకుని నేరుగా హాల్లోకి వెళ్లిపోయి మెసేజ్ చూసుకుని సీట్లు కూర్చోవ‌డ‌మే. వేరే యాప్స్ ఎన్ని ఉన్నా బుక్ మై షోకు ఉన్న పాపులారిటీనే వేరు. ప్ర‌తి సినీ ప్రేక్ష‌కుడి మొబైల్లోనూ ఇప్పుడు బుక్ మై షో యాప్ ఉండ‌టం కామ‌న్ అయిపోయింది.

వ‌చ్చే వారంలో భీమ్లా నాయ‌క్ లాంటి భారీ చిత్రం విడుద‌ల‌వుతుండ‌టంతో ఆ సినిమా బుకింగ్స్ ఎప్పుడు ఓపెన‌వుతాయా.. బుక్ మై షో యాప్‌లో టికెట్లు బుక్ చేసేద్దామా అని చూస్తుంటే.. వారికి పెద్ద షాక్ త‌గిలింది. నైజాంలో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న దిల్ రాజు.. ఇక్క‌డ మెజారిటీ థియేట‌ర్లు క‌లిగి ఉన్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్, ఎగ్జిబిట‌ర్, ప్రొడ్యూస‌ర్ సునీల్ నారంగ్.. ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్లు క‌లిసి బుక్ మై షోను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

భీమ్లా నాయ‌క్ సినిమాకు నైజాంలో ఆల్రెడీ ఒక థియేట‌ర్‌కు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసి.. త‌ర్వాత తీసేశారు. ప్ర‌స్తుతానికి బుక్ మై షోలో భీమ్లా నాయ‌క్ సినిమా అందుబాటులో లేదు. ఈ విష‌య‌మై సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు. బుక్ మై షోను తామే ప్ర‌మోట్ చేసి పాపుల‌ర్ చేశామ‌ని.. అదిప్పుడు ద‌య్యం లాగా మారింద‌ని వ్యాఖ్యానించారు. క‌న్వేయెన్స్ ఫీ పేరుతో టికెట్ మీద 20 నుంచి 40 రూపాయ‌ల దాకా వ‌సూలు చేస్తుండ‌టం.. ఇది ప్రేక్ష‌కుడికి భారంగా మారి థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేస్తుండ‌టం.. టికెట్ల ధ‌ర‌ల పెంపుతో ఇది పెద్ద స‌మ‌స్య‌గా మార‌డంతో ఆ యాప్‌, వెబ్ సైట్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించారు.

క‌న్వేయెన్స్ ఫీజు త‌గ్గించాల‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు కోరినా బుక్ మై షో వాళ్లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో భీమ్లా నాయ‌క్ లాంటి పెద్ద సినిమాకు దాన్ని బ‌హిష్క‌రించ‌డం ద్వారా బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. భీమ్లా నాయ‌క్‌కు పూర్తిగా థియేట‌ర్ల ద‌గ్గ‌రే బుకింగ్స్ జ‌ర‌గ‌నున్నాయ‌ట‌. ఐతే ఇంత పెద్ద సినిమాకు థియేట‌ర్ల ద‌గ్గ‌రే బుకింగ్స్ అంటే అదో స‌మ‌స్య‌గా మారొచ్చ‌ని, బ్లాక్ టికెట్ల దందా పెర‌గొచ్చ‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.