తెలుగు పరువు తీయనంటున్న బన్నీ

తెలుగు పరువు తీయనంటున్న బన్నీ

ఒక తెలుగు హీరోను చూసి కేరళ జనాలు వెర్రెత్తిపోతారని.. అక్కడ అతడికి అభిమాన సంఘాలు ఏర్పాటవుతాయని.. తెలుగుతో పాటే మలయాళంలోనూ మనోడి సినిమా రిలీజవుతుందని.. అక్కడ బెనిఫిట్ షోలు కూడా పడతాయని ఎవరైనా ఊహించారా? అల్లు అర్జున్ ఇలాంటి అనూహ్యమైన క్రేజే సంపాదిచాడు కేరళలో. అతడి కోసం మలయాళీలు ఎలా పడిచస్తారో ఇప్పటికే చాలాసార్లు చూశాం.

ఇప్పుడు 'అల వైకుంఠపురములో' మలయాళ వెర్షన్ కేరళలో బంపర్ క్రేజ్ మధ్య ఆదివారమే రిలీజవుతోంది. బన్నీ అక్కడికెళ్లి ప్రమోషన్లు చేయకపోయినా సరే.. క్రేజ్‌కు ఢోకా లేదు. మలయాళీలు తనపై చూపించే అభిమానం గురించి ఇంతకుముందే చాలాసార్లు బన్నీ మాట్లాడాడు. వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్ల కోసం నేరుగా మలయాళంలోనే ఒక సినిమా చేయాలనుకుంటున్నట్లు బన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెెల్లడించడం విశేషం.

ఐతే తమిళ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినపుడు తెలుగులో త్వరలోనే సినిమా చేస్తా అని రొటీన్ డైలాగ్ కొట్టినట్లు బన్నీ మొక్కుబడిగా ఈ మాట అనట్లేదు. మలయాళంలో సినిమా చేయడం కోసం సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు బన్నీ వెల్లడించాడు. అక్కడ సినిమా చేయడంపై తాను చాలా సీరియస్‌గా ఉన్నానని.. ఇప్పటికే అక్కడి దర్శకులు తనకు కొన్ని కథలు కూడా చెప్పారని.. కానీ అవి నచ్చక ఊరుకున్నానని బన్నీ తెలిపాడు.

మలయాళంలో చేస్తే ప్రత్యేకమైన సినిమా చేయాలని.. అలాంటి సినిమా చేయకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అక్కడికెళ్లి తెలుగు పరువు తీయాలనుకోవట్లేదని.. కాబట్టి ఎప్పుడు మలయాళంలో సినిమా చేసినా చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని బన్నీ తెలిపాడు. బన్నీ కొత్త చిత్రం కేరళలో 'అంగు వైకుంఠపురత్తు' పేరుతో రిలీజవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English