ఒకే రోజు రెండు సినిమాలు.. కెరీర్ ఏమ‌వుతుందో?

ఒకే రోజు రెండు సినిమాలు.. కెరీర్ ఏమ‌వుతుందో?

కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి వ‌రుస హిట్ల‌తో తెలుగులో త‌న‌ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్. ఐతే ఆరంభంలో క‌నిపించిన ఊపు.. త‌ర్వాత క‌నిపించ‌లేదు.

వ‌రుస ఫ్లాపుల‌తో చూస్తుండ‌గానే ఆమె కెరీర్ దెబ్బ తినేసింది. లుక్స్, యాక్టింగ్ ప‌రంగా మెహ్రీన్‌కు అంత మంచి పేరేమీ లేక‌పోవ‌డంతో నిల‌క‌డ‌గా విజ‌యాలు సాధించ‌డం ఆమెకు చాలా అవ‌స‌రంగా మారింది. ఐతే గ‌త కొన్నేళ్ల‌లో ఎఫ్‌-2 మిన‌హాయిస్తే మెహ్రీన్‌కు ఆశించిన విజ‌యాలే లేవు. ఎఫ్‌-2 త‌ర్వాత కూడా ఆమె కెరీర్ అంత‌గా ఊపందుకోలేదు. ఇలాంటి స‌మ‌యంలో సంక్రాంతి కానుక‌గా ఒకే రోజు రిలీజ్ కానున్న రెండు సినిమాల‌పై ఆమె ఆశ‌ల‌న్నీ నిలిచాయి.

ఇటు తెలుగులో, అటు త‌మిళంలో మెహ్రీన్ న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ‌వుతుండ‌టం విశేషం. తెలుగులో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టించిన ఎంత మంచివాడ‌వురా ఈ నెల 15న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రేసులో చివ‌ర‌గా రానున్న ఈ చిత్రంపై అంచ‌నాలు పెద్ద‌గా లేవు. దీని ట్రైల‌ర్ కూడా మామూలుగానే అనిపించింది.

ఐతే ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడే ఈ సీజ‌న్లో ఎంత మంచివాడ‌వురా సైలెంటుగా వ‌చ్చి హిట్ కొట్ట‌చ్చ‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సినిమా ఆడితే తెలుగులో మెహ్రీన్‌కు మ‌రికొన్ని అవ‌కాశాలు రావ‌చ్చు. మ‌రోవైపు త‌మిళంలో ధ‌నుష్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న మెహ్రీన్ న‌టించిన ప‌టాస్ జ‌న‌వ‌రి 15నే విడుద‌ల కాబోతోంది. అక్క‌డ ఆ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ఆడితే త‌మిళంలో మెహ్రీన్‌కు అవ‌కాశాలు ఊపందుకోవ‌చ్చు. మ‌రి ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటాయో చూడాలి.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English