కేసీఆర్‌తో ఎలాంటి గొడ‌వా లేదు: చిన‌జీయ‌ర్

గ‌త కొన్నాళ్లుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు, చిన‌జీయ‌ర్ స్వామికి వివాదాలు న‌డుస్తున్నాయ‌ని వ‌స్తున్న వార్త‌లను జీయ‌ర్ స్వామి తాజాగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎలాంటి విభేదాలూ లేవని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. సమతామూర్తి కేంద్రానికి వచ్చినప్పుడు ఆయనే మొదటి వాలంటీర్నని చెప్పినట్టు గుర్తుచేశారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల దృష్ట్యా సహస్రాబ్ది ఉత్సవాలకు రాలేకపోయి ఉంటారన్నారు. ఉత్సవాలకు సీఎం పూర్తి సహకారం ఉందని.. కల్యాణానికి ఆహ్వానిస్తామన్నారు.

ప్రతిపక్షాలు, స్వపక్షాలు, ప్రభుత్వాలు ఇలా తమకు ఎలాంటి భేదాలూ ఉండవని తెలిపారు. ప్రజాసేవలో వుండే ప్రతి వారికీ సమతా స్ఫూర్తి ఉండాలని సూచించారు. సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో ఫిబ్రవరి 19న కల్యాణ మహోత్సవం జరగునుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ప్రతి ఒక్కరూ కల్యాణాన్ని దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆరోగ్యం, ఇతర కార్యక్రమాల దృష్ట్యా సహస్రాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రాలేకపోయి ఉంటారని తెలిపారు.

శ‌నివారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రంలోని 108 ఆలయాల్లో కల్యాణ మహోత్సవం జరగునుందని చినజీయర్ స్వామి తెలిపారు. 12 రోజులుగా రామానుజ సహస్రాబ్ది, మహాయజ్ఞం, 108 ఆలయాల ప్రతిష్ఠ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయన్నారు. 14న జరగాల్సిన శాంతి కల్యాణం.. పలు కారణాల వల్ల వాయిదా పడిందని వివరించారు. రేపు జరగనున్న కల్యాణానికి 13 రోజులుగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరితో పాటు భక్తులందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రతి ఒక్కరు కల్యాణాన్ని దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేవుడికి పూజ, యాగం వంటివి జరిగే చోటా ఎలాంటి ఆహ్వానం అక్కర్లేదని సెలవిచ్చారు.

ప్రస్తుతం.. ప్రతి రోజు మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు రామానుజాచార్యులను భక్తులు దర్శించుకోవచ్చని చినజీయర్స్వామి తెలిపారు. ఆదివారం(ఫిబ్రవరి 20) నుంచి సువర్ణమూర్తిని దర్శించుకునే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. సమతాస్ఫూర్తిని పంచేందుకు ఇది ఆరంభం మాత్రమేనన్న చినజీయర్ స్వామి.. పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనం కల్పించేందుకు మరికాస్త సమయం పడుతుందన్నారు.