ప్రేక్షకులారా.. సంక్రాంతి క్షవరానికి సిద్ధం కండి

 ప్రేక్షకులారా.. సంక్రాంతి క్షవరానికి సిద్ధం కండి

ప్రేక్షకులు తమకు భారీ సినిమా కావాలా.. మీడియం రేంజి సినిమా కావాలా.. చిన్న చిత్రం కావలా అని అడగరు. సినిమా ఏ స్థాయిదైనా కంటెంట్ బాగుండాలని కోరుకుంటారు. మంచి సినిమా అయితే చాలన్నది వాళ్ల ఫీలింగ్. కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ఇలా ఆలోచించరు. మేం ఇంత పెట్టుబడి పెట్టి సినిమా తీశాం. కాబట్టి మీరు ఇంత రేటు పెట్టి టికెట్ కొనాల్సిందే అని హుకుం జారీ చేస్తారు. భారీ చిత్రాలతో తరచుగా ఎదురయ్యే ఇబ్బంది ఇది.

'సాహో', 'సైరా నరసింహారెడ్డి', 'మహర్షి' లాంటి భారీ చిత్రాలకు గత ఏడాది టికెట్లు రేట్లు ఇష్టానుసారం పెంచేసిన సంగతి తెలిసిందే. ఆయా చిత్రాల నిర్మాతలు ఇలా అడగ్గానే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అలా రేటు పెంచుకునే అవకాశం ఇచ్చేశాయి. వాళ్లకు పోయేదేముంది? చిల్లులు పడేది ప్రేక్షకుల జేబులకే.

ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులకు క్షవరం చేయడానికి రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతికి రాబోయే భారీ చిత్రాలకు టికెట్ల రేట్లు పెంచడానికి రంగం సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మేరకు అనుమతులు కూడా సంపాదించినట్లు సమాచారం. ఆంధ్రాలో అయితే మరీ అన్యాయంగా సింగిల్ స్క్రీన్లలో టికెట్ల రేట్లను రూ.200కు, మల్టీప్లెక్సుల్లో రూ.250కి పెంచేయబోతున్నారట.

తెలంగాణలో ఈ మొత్తం రూ.150, రూ.200గా ఉండబోతోందని సమాచారం. ఇలాంటి వ్యవహారాల్ని చక్కబెట్టడంలో నిర్మాత దిల్ రాజు సిద్ధహస్తుడు. సంక్రాంతికి రాబోయే రెండు భారీ చిత్రాల్లో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన భాగస్వామ్యం ఉంది. రెండు చోట్లా నిర్మాతలతో కలిసి ఆయన రేట్ల పెంపు కోసం అనుమతులు సంపాదించినట్లు తెలుస్తోంది.

'దర్బార్', 'ఎంతమంచివాడవురా' సినిమాలకు ఇలా రేట్లు పెంచితే కష్టం. కాబట్టి వాటిని మినహాయించి మిగతా రెండు భారీ చిత్రాలకు మాత్రం ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టడానికి రంగం సిద్ధమైనట్లే.
    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English