టికెట్ల రేట్లు ఆలస్యం.. టార్గెట్ భీమ్లా నాయక్?

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధలర విషయమై లేని సమస్యను సృష్టించి.. దాన్ని పెంచి పెద్దది చేసి.. ఇప్పుడు దాన్ని పరిష్కరిస్తున్నట్లుగా చూపిస్తూ ఇండస్ట్రీ జనాల నుంచి జేజేలు కొట్టించుకుంటోంది జగన్ సర్కారు. దేశంలో మిగతా రాష్ట్రాలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే తక్కువగానే రేట్లు ఉన్నప్పటికీ.. ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం చేశారు. బ్లాక్‌లో టికెట్లు అమ్మితే అది థియేటర్ల యాజమాన్యాల తప్పవుతుంది. ఆ డబ్బులేమీ నిర్మాతలు, హీరోల జేబుల్లోకి వెళ్లవు.

అలాంటి అక్రమాలకు అడ్డు కట్ట వేయాల్సిందే ప్రభుత్వం. అది చేయకుండా బ్లాక్ టికెట్ల వ్యవహారాన్ని ఇండస్ట్రీకి ముడిపెడుతూ టికెట్ల రేట్ల గురించి నానా యాగీ చేశారు. అసలే కొవిడ్ వల్ల కుదేలైన ఇండస్ట్రీకి టికెట్ల రేట్ల వ్యవహారం పెద్ద గుదిబండలా తయారైంది. చివరికి ఇండస్ట్రీ తరఫున చిరంజీవి సహా ప్రముఖులు ఎన్నో ప్రయత్నాలు చేశాక ఇటీవలే టికెట్ల రేట్లను సవరించడానికి జగన్ సర్కారు అంగీకరించింది.

ఇన్నాల్లూ పేదల పేరు చెప్పి రేట్లు తగ్గించి ఇప్పుడు రేట్లు ఎలా పెంచుతారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.ఇదిలా ఉంటే రేట్ల పెంపుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయినా.. స్వయంగా ముఖ్యమంత్రే ఈ మేరకు ప్రకటన చేసినా.. ఇంకా జీవో మాత్రం రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టికెట్ల ధరలపై నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం.. తదుపరి జీవో జారీ చేయడం.. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఇంకో వారం పది రోజులకు కానీ జీవో వచ్చే అవకాశం లేదని సదరు కమిటీ స్పష్టం చేసింది. ఈపాటికే జీవో వచ్చేయాల్సింది కానీ.. ‘భీమ్లా నాయక్’ సినిమాను ఈ నెల 25నే రిలీజ్ చేస్తారన్న సంకేతాలు రావడంతో ఆగినట్లు తెలుస్తోంది. జీవో రిలీజై కొత్త ధరలు ఆ సినిమాకు ప్లస్ అవుతాయేమో అన్న ఉద్దేశంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు ఇండస్ట్రీ జనాలు భావిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ 25నే వచ్చేట్లయితే.. ఆ సినిమా థియేట్రికల్ రన్ అంతా అయ్యే వరకు జీవో రాదన్నది స్పష్టం.