చంద్రబాబుకు అతిపెద్ద సంకటం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నానాటికీ చిక్కుల్లో కూరుకుపోతున్నారా?  ఆయ‌నకు అవ‌కాశం కూడా చిక్క డం లేదా?  అంటే..ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా జాతీయ రాజ‌కీయాల్లో మార్పులు కొరుకుం టూ .. ప‌లు ప్రాంతీయ పార్టీలు వ్యూహాలు రెడీ చేసుకుంటున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపే వ‌ర‌కు నిద్ర‌పోన‌ని చెప్పారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార పార్టీల‌తో క‌లిసి .. కేంద్రంపై పోరు కు రెడీ అయ్యారు. అయితే.. అది స‌క్సెస్ కాలేదు. ఇంతలో ఎన్నికలు రావ‌డం.. ఆయ‌న ఓడిపోవ‌డం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు మ‌రోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు జాతీయ రాజ‌కీయాల్లో మార్పుల దిశ‌గా ముఖ్యంగా మోడీని గ‌ద్దె దింపేందుకు ప్రాంతీయ పార్టీలు రెడీ అయ్యాయి. ఈ క్ర‌మంలో నే రెండు రోజుల కింద‌ట‌.. గ‌తంలో చంద్ర‌బాబుతో క‌లిసి ప‌నిచేసిన బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నుంచి బాబుకు ఫోన్ వ‌చ్చింది. మేం రెడీ అవుతున్నాం.. మీరేం చేస్తారంటూ.. ఆమె ప్ర‌శ్నించారు. అయితే.. దీనిపై చంద్ర‌బాబు స్పందించ‌లేదు. పైగా ఇప్పుడు ఆయ‌న మోడీకి వ్య‌తిరేకంగా మారితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌వు. జాతీయ రాజ‌కీయాలు అలా ఉంచితే.. రాష్ట్రంలో ఆయ‌న అధికారంలోకి రావాల్సిన అత్యంత అవ‌స‌రం ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో ఆయ‌న జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయితే.. ఇప్పుడు వ‌చ్చిన అవ‌కాశం వ‌దులుకున్నా మంచిది కాదు. ఎందుకంటే.. మోడీపై వ్య‌తిరేకత రాష్ట్రాల స్థాయిలో తీవ్రంగా ఉంది. గ‌తంలోనూ కేంద్రంలో చ‌క్రం తిప్పాన‌ని చెప్పుకొనేందుకు చంద్ర‌బాబు ఇది అత్యంత కీల‌క స‌మ‌యం. ఆయ‌న క‌లిసి వ‌స్తే.. ప‌గ్గాలు ఆయ‌న‌కే అప్ప‌గించేందుకు కూడా పార్టీలు రెడీ అవుతున్నాయి. కేసీఆర్ మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. క‌ర్ణాట‌క‌లో మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, మ‌మ‌తా బెన‌ర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటివారు… బాబు  సామ‌ర్థ్యంపై అవ‌గాహ‌న ఉన్న‌వారే కావ‌డం.. గ‌తంలోనూ ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం ఉండ‌డం గ‌మ‌నార్హం.

సో.. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు స్పందిస్తే.. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న ఎలివేట్ అయి.. ఇక్క‌డ కూడా పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే.. తానుజాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెడితే.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మారుతుంద‌ని.. బాబు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు.. జ‌గ‌న్ .. ఎలాగూ.. మోడీని విడిచిపెట్టేది లేద‌ని.. ఆయ‌న అనుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో అటు జాతీయ రాజ‌కీయాల్లో వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులు కోవాలా?  లేక‌.. ఇక్క‌డ ఉండాలా? అనే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో చంద్ర‌బాబు మునిగిపోయారు.