అసురన్ రీమేక్.. ఆమే కరెక్ట్

అసురన్ రీమేక్.. ఆమే కరెక్ట్

విక్టరీ వెంకటేష్ ఓ సాహసోపేత సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. తమిళంలో విజయవంతమైన 'అసురన్' రీమేక్‌లో ఆయన నటించనున్నాడు. వెంకీ అన్నయ్య సురేష్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇది చాలా ఇంటెెన్స్‌గా.. వయొలెంట్‌గా.. రియలిస్టిగ్గా సాగే సోషల్ కాజ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు తెలుగులో వర్కవుటవుతాయా అన్న సందేహాలు ఉన్నప్పటికీ వెంకీ ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నాడు. తమిళంలో ధనుష్ అద్భుత అభినయం ప్రదర్శించిన పాత్రలో వెంకీ ఎలా ఒదిగిపోతాడో చూడాలి. ఆయనకు జోడీగా నటించే కథానాయిక గురించి ఇప్పటిదాకా కొన్ని ప్రచారాలు జరిగాయి. ముందు అనుష్కను వెంకీకి జోడీగా అనుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత శ్రియ పేరు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియమణిని వెంకీకి జోడీగా ఫిక్స్ చేసినట్లు సమాచారం బయటికి వచ్చింది.

ఐతే ముందు అనుకున్న ఇద్దరు హీరోయిన్లతో పోలిస్తే ప్రియమణే ఈ పాత్రకు కరెక్ట్ అనడంలో మరో మాట లేదు. అనుష్క ఆహార్యం ప్రకారం చూస్తే ఆమెను మంజు వారియర్ పాత్రలో ఊహించుకోవడం కష్టం. ఇప్పటికే 'సైజ్ జీరో' లాంటి సినిమాల్లో అనుష్కను డీ గ్లామరస్‌ పాత్రలో చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక 'అసురన్' లాంటి రియలిస్టిక్ మూవీలో మంజు మాదిరి అనుష్క కనిపిస్తే ఆమె అభిమానులు తట్టుకోలేరు. అనుష్క మంచి నటే అయినప్పటికీ ఇలాంటి పాత్రలో ఆమె మెప్పించడం కష్టమే.

ఇక శ్రియ సంగతి తీసుకుంటే.. ఆమె గత కొన్నేళ్లలో కొన్ని పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకా గ్లామర్ ఇమేజ్ పోలేదు. ఇప్పటికీ హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూనే ఉంది. మధ్య తరగతి ఇల్లాలి పాత్రల్లోనే శ్రియ అంత ఫిట్‌గా అనిపించదు. ఇక పేదింటికి చెందిన.. పెళ్లీడుకొచ్చిన కొడుకుకు తల్లిగా అంటే  అసలు సూటవ్వదేమో. ప్రియమణి విషయానికి వస్తే.. ఆమె లుక్స్ ప్రకారం చూస్తే మిడిలేజ్డ్‌ పాత్రలకు సూటవుతుంది. అందులోనూ 'పరుత్తి వీరన్' లాంటి సినిమాల్లో చేసిన అనుభవం 'అసురన్'లో మంజు వారియర్ పాత్ర చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అనుష్క, శ్రియలతో పోలిస్తే ఈ పాత్రలో ప్రియమణి సులువుగా ఒదిగిపోయే అవకాశముంది కాబట్టి ఈ సినిమాకు ఆమే రైట్ ఛాయిస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English