షార్ట్ ఫిలిం తీసేయ్.. ఫీచర్ ఫిలిం పట్టేయ్

షార్ట్ ఫిలిం తీసేయ్.. ఫీచర్ ఫిలిం పట్టేయ్

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కుడు కావాలంటే ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయ‌డ‌మే ఏకైక మార్గంగా క‌నిపించేది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేరి.. ఏళ్లు, ద‌శాబ్దాలు ప‌ని చేశాక కానీ ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం వ‌చ్చేది కాదు. అలా ఎన్నో ఏళ్లు ప‌ని చేశాక కూడా అవ‌కాశాలు రాక నిష్క్ర‌మించిన వాళ్లూ ఉన్నారు.

కానీ ఇప్పుడు క‌థ మారిపోయింది. ఒక డిజిట‌ల్ కెమెరా ప‌ట్టుకుని షార్ట్ ఫిలిం తీయ‌డం.. అది యూట్యూబ్‌లో రిలీజ్ చేయ‌డం.. అలా ప్ర‌తిభ చాటుకుని ద‌ర్శ‌కులుగా అవ‌కాశాలు అందుకోవ‌డం.. ఈ త‌రం ద‌ర్శ‌కుల‌కు ఇదే ద‌గ్గ‌ర దారిగా మారిపోయింది. గ‌త ప‌ది ప‌దిహేనేళ్ల‌లో ఈ మార్గంలో ద‌ర్శ‌కులుగా మారిన కుర్రాళ్లు చాలామందే ఉన్నారు. వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ల‌ఘుచిత్రాలు తీసి.. ఆపై ద‌ర్శ‌కులుగా అవ‌కాశాలు అందుకుని ప‌దులు, వంద‌ల కోట్ల‌ బ‌డ్జెట్ల‌లో ఫీచ‌ర్ ఫిలింలు తీసిన వాళ్లుండ‌టం విశేష‌మే.

తాజాగా టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమాను రూపొందించింది షార్ట్ ఫిలిం డైరెక్ట‌రే. అత‌డి పేరు.. రితేష్ రాణా. అత‌ను సెకండ్ ఛాన్స్ స‌హా కొన్ని షార్ట్ ఫిలింలు తీశాడు. వాటితో పేరు సంపాదించి.. మైత్రీ మూవీ మేక‌ర్స్ వాళ్ల‌ను క‌లిసి మూడేళ్ల కింద‌ట మ‌త్తు వ‌ద‌ల‌రా క‌థ చెప్పాడ‌ట‌. లైన్ న‌చ్చింది. డెవ‌ప‌ల్ చేయ‌మ‌న్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాతో అత‌ను టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయ్యాడు.

ఇక కొన్ని నెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయిన భారీ చిత్రం సాహో తీసిన సుజీత్ కూడా షార్ట్ ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన వాడే అన్న సంగ‌తి తెలిసిందే. అత‌ను ఎవ‌రి ద‌గ్గ‌రా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయ‌లేదు. షార్ట్ పిలింల‌తోనే పేరు సంపాదించాడు. యువి క్రియేష‌న్స్ వాళ్ల‌ను మెప్పించి ర‌న్ రాజా ర‌న్‌తో ద‌ర్శ‌కుడిగా మారాడు. ఈ సినిమా హిట్ట‌వ‌డంతో సాహో లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అరుదైన అవ‌కాశం ల‌భించింది.

ఇంకా చాలామందే..

షార్ట్ ఫిలిం టు ఫీచ‌ర్ ఫిలిం డైరెక్ట‌ర్లు గ‌త ద‌శాబ్ద కాలంలో చాలామందే వ‌చ్చారు. 'వెన్నెల' లాంటి సక్సెస్ ఫుల్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత 'ప్రస్థానం' లాంటి క్లాసిక్ తీసిన దేవా కట్టా కూడా షార్ట్ ఫిలిం తీసి వెలుగులోకి వచ్చినవాడే. 'మహానటి'తో మేటి దర్శకుడిగా పేరు సంపాదించిన నాగ్ అశ్విన్ 'యాదోంకీ బారత్' అనే షార్ట్ ఫిలింతో వెలుగులోకి వచ్చాడు.

ఇక 'పెళ్ళిచూపులు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ 'సైన్మా' సహా కొన్ని లఘుచిత్రాలతో ముందే బాగా పాపులర్ అయ్యాడు. 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ 'సైలెంట్ మెలోడీ' సహా కొన్ని లఘు చిత్రాలతో పేరు సంపాదించిన ఫీచర్ ఫిలిం అవకాశాన్ని అందుకున్నాడు.  

'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి క్లాస్ లవ్ స్టోరీలు అందించిన శివ నిర్వాణ 'లవ్ ఆల్జీబ్రా', 'వన్ మోర్ స్మైల్' లాంటి షార్ట్ ఫిలింలతో సత్తా చాటుకున్నాడు.

ఇంకా 'అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి, 'భలే మంచి రోజు' దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఫేమ్ మేర్లపాక గాంధీ, 'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన రాహుల్ సంకృత్యన్, 'మను' ఫేమ్ ఫణీంద్ర నరిశెట్టి, 'ప్రేమ ఇష్క్ కాదల్' దర్శకుడు పవన్ సాధినేని, 'ఉయ్యాల జంపాల'తో దర్శకుడిగా మారిన విరించి వర్మ.. ఇలా షార్ట్ ఫిలింలతో పేరు సంపాదించి ఫీచర్ ఫిలిం డైరెక్టర్లుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు.

ఐదు పది నిమిషాల నిడివితో తీసే షార్ట్ ఫిలింల్లో తమ షార్ప్‌నెస్ చూపించి.. అన్ని వనరులూ ఉంటే ఫీచర్ ఫిలిం ఇంకా బాగా తీయగలమనే నమ్మకాన్ని ఇండస్ట్రీ జనాల్లో కలిగించి సులువుగానే అవకాశాలు అందుకుంటున్నారు ఈ తరం యువ దర్శకులు. ఈ కోవలో మున్ముందు మరింత మంది దర్శకులుగా మారే అవకాశాలున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English