‘రూలర్’ పరిస్థితి దారుణాతి దారుణం

‘రూలర్’ పరిస్థితి దారుణాతి దారుణం

నందమూరి బాలకృష్ణ మార్కెట్ ఏ స్థాయికి పడిపోయిందో ‘రూలర్’ సినిమాతో రుజువవుతోంది. ఆయన కెరీర్లోనే ఎన్నడూ లేని పతనం చవిచూస్తున్నాడాయన. బాలయ్య సినిమా రిలీజైన ఫస్ట్ వీకెండ్లో ఒక ఫుల్ డే వసూళ్లు కోటి రూపాయల మార్కును కూడా అందుకోవట్లేదంటే ఏమనాలి?

డిజాస్టర్ మూవీ ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’కు కొనసాగింపుగా విపరీతమైన నెగెటివిటీతో వచ్చిన ‘మహానాయకుడు’కు అలాంటి వసూళ్లు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇప్పుడు ‘రూలర్’ సినిమా కూడా దానికి దీటుగా పతనం చూస్తోంది. తొలి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైనే షేర్ వచ్చింది. మామూలుగా చూస్తే బాలయ్య రేంజికి అవి తక్కువ వసూళ్లే. ఐతే ‘రూలర్’కు హైపే లేని నేపథ్యంలో ఈ వసూళ్లు పర్వాలేదనే చెప్పాలి. కానీ రెండో రోజు ఇందులో నాలుగో వంతు కూడా షేర్ రాకపోవడం దారుణం. ఏపీ, తెలంగాణలో కలిపి కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాలేదు.

శనివారం రెండు రాష్ట్రాల్లో కలిపి ‘రూలర్’కు రూ.94 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అందులో బాలయ్యకు పట్టున్న రాయలసీమ నుంచి వచ్చిందే రూ.26 లక్షలు. తెలంగాణ మొత్తం జిల్లాల్లో కలిపి రూ.30 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. కృష్ణాలో 5 లక్షలు.. గుంటూరులో 7 లక్షలు.. తూర్పు గోదావరిలో 6 లక్షలు.. పశ్చిమ గోదావరిలో 5 లక్షలు.. ఫుల్ డే షేర్ అంటే బాలయ్య పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో చెప్పడానికి ఈ గణాంకాలు రుజువు.

తొలి వీకెండ్లో, శనివారం నాడు ఈ షేర్లు చూశాక బాలయ్యను ఒక స్టార్ హీరోగా ఎలా పరిగణించాలి? రెండో రోజు దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్కటంటే ఒక్క షో అయినా ‘రూలర్’కు హౌస్ ఫుల్ పడిందా అంటే సందేహమే. ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి వచ్చేలా లేవు. అక్కడ సినిమాకు అసలు బిజినెస్ ఆఫర్లే లేకపోవడంతో దాదాపుగా ఫ్రీగా సినిమాను ఇచ్చేశారు. అక్కడ కలెక్షన్లు మరీ నామమాత్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అవతల ఎక్కడా ‘రూలర్’ను పట్టించుకునేవాళ్లు లేరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English