రాజ‌కీయాల‌కు మోహ‌న్ బాబు టాటా

మంచు మోహ‌న్ బాబు రాజ‌కీయాల్లో ఉన్నారంటే ఉన్నారు. లేరు అంటే లేరు. ఆయ‌న గ‌తంలో తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల్లో ఉండి వాటికి ప్ర‌చారం చేయ‌డం.. ఒక ప‌ర్యాయం రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగ‌డం తెలిసిందే. ఐతే ఎంపీగా ప‌ద‌వీ కాలం ముగిశాక ఆయ‌న క్ర‌మంగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. కొన్నేళ్ల పాటు రాజ‌కీయాల జోలికే వెళ్ల‌లేదు. మ‌ళ్లీ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు మోహ‌న్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారుగా మారారు.

వైకాపా కండువా క‌ప్పుకుని ఆ పార్టీ త‌ర‌ఫున అభ్యర్థుల కోసం కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల‌ ప్ర‌చారానికి కూడా వెళ్లారు. ఐతే ఎన్నిక‌ల త‌ర్వాత మోహ‌న్ బాబుకు జ‌గ‌న్ స‌ర్కారు త‌గిన ప్రాధాన్యం, గౌర‌వం ఇవ్వ‌ట్లేద‌న్న అభిప్రాయాలు వివిధ సంద‌ర్భాల్లో వ్య‌క్త‌మ‌య్యాయి. చంద్ర‌బాబు స‌ర్కారు హ‌యాంలో ఉన్న‌ ఫీజ్ రీఎంబ‌ర్స్‌మెంట్ స‌మ‌స్య ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. అయినా మోహ‌న్ బాబు ఏమీ చేయ‌లేక‌పోతున్నారు.

జ‌గ‌న్‌ను, ఆయ‌న ప్ర‌భుత్వాన్ని పొగ‌డ‌నూ లేక‌, విమ‌ర్శించ‌నూ లేక కొంత కాలంగా మౌనం వ‌హిస్తున్న మోహ‌న్ బాబు.. ఇప్పుడు రాజ‌కీయాల ప‌ట్ల మ‌రోసారి త‌న వైరాగ్య ధోర‌ణిలో మాట్లాడారు. తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్ర‌క‌టించారు. త‌న కొత్త చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌మోష‌న్ల కోస‌మ‌ని మీడియాను క‌లిసిన ఆయ‌న ఇకపై తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌న్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి త‌న‌కు లేదని.. ఈ జన్మకు వద్దని అనుకుంటున్నానని మోహ‌న్ బాబు అన్నారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు, ప్ర‌స్తుత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి త‌న‌కు బంధువులు కాబట్టి గతంలో ప్రచారం చేశానని.. చంద్రబాబుకి చేసినట్లు జగన్‌కూ ప్రచారం చేయాలి కాబట్టి చేశామ‌ని.. అది అక్కడితో అయిపోయిందని.. ఇప్పుడు తాను సినిమాలు, యూనివర్శిటీ పనులతో బిజీగా ఉన్నాన‌ని. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లకూడదని అనుకుంటున్నాన‌ని మోహ‌న్ బాబు స్ప‌ష్టం చేశారు.