ఫ్లాపవుతుందని తెలిసీ బాలయ్య చేసిన సినిమా

ఫ్లాపవుతుందని తెలిసీ బాలయ్య చేసిన సినిమా

కొన్ని సినిమాలు ఆడవనే సంగతి మేకింగ్ దశలోనే తెలిసిపోతుంది. కానీ తప్పక ఆ సినిమాలు చేయాల్సి వస్తుంది. ఐతే మేకింగ్ కంటే ముందు స్క్రిప్టు దగ్గరే సంతృప్తి లేనపుడు సినిమా ఆపేయడం మంచిది. కానీ ఒక సినిమా కథ విషయంలో దర్శకుడు, హీరో ఇద్దరూ సంతృప్తిగా లేకపోయినా.. ఈ కథ వర్కవుట్ కాదని ఆ ఇద్దరూ తేల్చేసినా.. ఆ సినిమాను పట్టాలెక్కించారంటే ఆశ్చర్యపోవాల్సిందే. చివరికి వాళ్ల అంచనాలకు తగ్గట్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కూడా అయిందట.

ఇలాంటి సాహసం నందమూరి బాలకృష్ణ, సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి కలిసి చేశారట. ఆ సినిమా పేరు.. తిరగబడ్డ తెలుగు బిడ్డ. వీళ్లిద్దరూ బాలయ్య తండ్రి ఎన్టీఆర్ బలవంతం మేరకే తమకు ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశారట. దీని వెనుక కథేంటో ఒక టీవీ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి వెల్లడించారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయన ఓకే చేసిన కథతో బాలయ్య హీరోగా 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమా చేశారట కోదండరామిరెడ్డి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో మళ్లీ బాలయ్యతో కోదండరామిరెడ్డిని ఇంకో సినిమా తీయమని అడిగారట ఎన్టీఆర్. ఐతే ఈసారి ఎన్టీఆర్ ఓకే చేసిన కథను కోదండరామిరెడ్డి వినగా.. అది ఆయనకు నచ్చలేదట. ఆ విషయాన్ని ముఖం మీదే కోదండరామిరెడ్డి చెప్పేశారట. మీకు నచ్చని కథ ఎందుకు సినిమా చేయమంటాం అంటూ ఎన్టీఆర్ కూడా ఆ కథను పక్కన పెట్టేశారట.

కానీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎన్టీఆర్ ఫోన్ చేసి ఆ కథతోనే సినిమా చేయమని కోదండరామిరెడ్డికి చెప్పారట. ఆయన అంతగా చెప్పాక తప్పదని సినిమా తీయడానికి రెడీ అయ్యారట కోదండరామరెడ్డి. ఐతే ఈ కథ తనకు కూడా నచ్చలేదని బాలయ్య కూడా చెప్పాడట. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సన్నివేశంలో రెండో టేక్ కోసం అడిగితే.. ఫ్లాప్ అయ్యే సినిమాకు రెండో టేక్ ఎందుకు అంటూ బాలయ్య అసహనం వ్యక్తం చేశాడట. చివరికి తామిద్దరం అయిష్టంగానే చేసిన ఈ సినిమా అనుకున్నట్లే అట్టర్ ఫ్లాప్ అయిందని కోదండరామిరెడ్డి వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English