కేంద్రం ఎందుకు ప్లేటు ఫిరాయించింది ?

ఇపుడిదే విషయమై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 17వ తేదీన చర్చించేందుకు ఒక కమిటీని నియమించినట్లు స్వయంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్రం ప్రకటించింది. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే అన్నంతగా జనాలంతా చాలా హ్యాపీగా ఫీలయిపోయారు. ఇంత కాలానికైనా రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని సంబరపడ్డారు. అయితే రాత్రి 7 గంటలకు మళ్ళీ కేంద్రం చేసిన ప్రకటనతో జనాలకు మండిపోయింది.

ఇంతకీ రెండోసారి కేంద్రం చేసిన ప్రకటన ఏమిటంటే 17వ తేదీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశంతో పాటు ఆర్థిక అంశాలు ఉండవని సవరణ ప్రకటన చేసింది. దాంతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలో ఏమి డెవలప్మెంట్లు జరిగిందో అర్థం కాలేదు. మొదట అజెండాను సెట్ చేసింది కేంద్రమే. రాత్రికి అజెండాను మార్చేసిందీ కేంద్రమే. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ లాంటి ఆర్థిక అంశాలను మొదట కేంద్రం ఎందుకు చేర్చింది ? తర్వాత ఎందుకు తీసేసింది ?

ఉదయం కేంద్రం ప్రకటన చూసిన తర్వాత వైసీపీ ఎంపీలు, ఎంఎల్ఏలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్రానికి ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే రాత్రికి మారిపోయిన అజెండాతో వాళ్ళంతా మండిపోతున్నారు.  ఇదే విషయమై వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీలో చేరిన టీడీపీ ఫిరాయింపు ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ లే అజెండాను మార్పించేసినట్లు ఆరోపించారు.

ఉదయం కేంద్రం చేసిన అజెండా  ప్రకటనపై చంద్రబాబునాయుడు, జీవీఎల్ ఎందుకు  ధన్యవాదాలు చెప్పలేదని అంబటి నిలదీశారు. ప్రత్యేక హోదా అంశాన్ని అంజెడాలో చేర్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనను చంద్రబాబు అండ్ కో ఎందుకు స్వాగతించలేదంటు అంబటి సూటిగా ప్రశ్నించారు. అంబటి ఆరోపణలు చేస్తున్నట్లు చంద్రబాబు అండ్ కో కు సంబంధం ఉందో లేదో తెలీదు. కానీ జీవీఎల్ మాట్లాడిన విషయంపై మాత్రం అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.  మొత్తానికి కేంద్రం ప్లేటు ఫిరాయించటంపై జనాల్లో మాత్రం మంటలు రేగుతున్నాయి.