ఇచ్చి ప‌డేసిన టిల్లు

అప్పుడ‌ప్పుడూ కొన్ని చిన్న సినిమాల‌కు రిలీజ్ ముంగిట‌ అనూహ్య‌మైన క్రేజ్ వ‌స్తుంటుంది. అందులో హీరో స్టార్ కాక‌పోయినా.. అది పెద్ద బ‌డ్జెట్ సినిమా కాక‌పోయినా.. ప్రోమోలు ఆక‌ట్టుకోవ‌డం వ‌ల్ల వాటికి హైప్ వ‌చ్చేస్తుంటుంది. యూత్ సినిమా చూడ్డానికి ఎగ‌బ‌డిపోతారు. పేరున్న సినిమాల మాదిరి తొలి రోజు హౌస్ ఫుల్స్ ప‌డిపోతుంటాయి. ట్రేడ్ వ‌ర్గాలు ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్లు వ‌స్తుంటాయి. ఈ సినిమాల‌కు టాక్‌తో కూడా సంబంధం ఉండ‌దు.

ఏడాదిలో ఒక‌టో రెండో సినిమాల‌కు ఇలా జ‌రుగుతుంటుంది. పోయినేడాది జాతిర‌త్నాలు సినిమాకు ఇలాంటి మ్యాజిక్కే జ‌రిగింది. ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం చిత్రం కూడా డివైడ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇప్పుడు కొత్త ఏడాదిలో డీజే టిల్లు కూడా ఇలాంటి మ్యాజిక్కే చేస్తోంది. ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ అయిన‌ప్ప‌టి నుంచి యూత్ సినిమా కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడీ చిత్రం థియేట‌ర్ల‌లోకి దిగ‌డంతో యూత్ వెర్రెత్తిపోయిన‌ట్లే క‌నిపిస్తున్నారు.

ముందు రోజు డీజే టిల్లుకు జ‌రిగిన అడ్వాన్స్ బుకింగ్సే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. నైజాంలో చాలా చోట్ల షోలు సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేట‌స్‌లో క‌నిపించాయి. ప్ర‌ధాన మ‌ల్టీప్లెక్సుల్లో ఎన్ని షోలు పెడితే అన్ని షోలూ ఫుల్ అయిపోయాయి. రిలీజ్ రోజు మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి.

నైజాంలో ఈ సినిమా వ‌సూళ్ల మోత మోగించేట్లే క‌నిపిస్తోంది. తొలి రోజు నంబ‌ర్స్ సినిమా స్థాయికి అనూహ్యంగానే ఉండ‌బోతున్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. సినిమాకు కొంచెం డివైడ్ టాక్ ఉన్న‌ప్ప‌టికీ.. టిల్లు క్యారెక్ట‌ర్.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ పెర్ఫామెన్స్.. డైలాగ్స్‌కు కుర్రాళ్లు బాగా క‌నెక్ట‌యిన‌ట్లే క‌నిపిస్తున్నారు. ఆ మాత్రం ఎంట‌ర్టైన్మెంట్ చాల‌న్న ఫీడ్ బ్యాక్ వ‌స్తోంది. ఈ సినిమా ఫుల్ ర‌న్లో ప‌ది కోట్ల షేర్ రాబ‌ట్టే అవ‌కాశాలున్నాయ‌న్నది ట్రేడ్ వ‌ర్గాల మాట‌. నైజాంలో మాత్ర‌మే ఏడెనిమిది కోట్ల షేర్ వ‌స్తుంద‌ని అంచ‌నా. అదే జ‌రిగే ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన‌ట్లే.