వీకెండ్ అయిపోయింది.. 'మామ' వీక్ అవుతాడా?

వీకెండ్ అయిపోయింది.. 'మామ' వీక్ అవుతాడా?

ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుందో చెప్పలేం. గత రెండు నెలల్లో చాలా సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. మంచి టాక్ వచ్చిన సినిమాలు సైతం నిలబడలేదు. కానీ మూడు రోజుల కిందట రిలీజైన 'వెంకీ మామ'కు ఏమంత మంచి టాక్ రాకున్నా.. రివ్యూలన్నీ యావరేజ్, నెగెటివ్‌గా ఉన్నా ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్‌పై ఎంతమాత్రం పడలేదు.

చాలా రోజులుగా తెలుగులో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వెళ్లడానికి రేంజ్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తుండటంతో 'వెంకీ మామ' వాళ్లకు మంచి ఛాయిస్ అయింది. టాక్, రివ్యూలు ఏమీ పట్టించుకోకుండా థియేటర్లను నింపేశారు. వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్ వసూళ్లతో సాగిపోయిందీ సినిమా. మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా షేర్ అంటే చిన్న విషయం కాదు. వీకెండ్ వరకు చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ రేంజిలో సాగుతోంది.

ఐతే సోమవారం నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందన్నది ఆసక్తికరం. ఇంతకుముందు చాలా సినిమాలు వీకెండ్ వరకు జోరు చూపించి.. ఆ తర్వాత స్లో అయిపోయాయి. కొన్ని నెలల కిందట నాని 'గ్యాంగ్ లీడర్'కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. వీకెండ్లో ఊపు చూసి సినిమా హిట్టే అనుకున్నారు. కానీ తర్వాత నిలబడలేకపోయింది. మరి 'వెంకీ మామ' సోమవారం నుంచి ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.

రాబోయే వీకెండ్లో కొత్త సినిమాల సందడి బాగానే ఉండబోతోంది. 'ప్రతి రోజూ పండగే', 'రూలర్' సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు 'దొంగ', 'దబంగ్-3' ఒకే రోజు రిలీజవుతున్నాయి. ఇప్పుడు 'వెంకీ మామ' మినహా ఛాయిస్ లేకపోవడం దీనికి కలిసొచ్చింది. టాక్ ఏమంత బాలేకున్నా ప్రేక్షకులు ఆ సినిమానే చూశారు. కానీ రాబోయే వీకెండ్లో కొత్త సినిమాల పోటీని తట్టుకుని 'వెంకీ మామ' రెండో వీకెండ్లో ఏమాత్రం వసూళ్లు సాధించగలదన్నది సందేహం. కాబట్టి రాబోయే నాలుగు రోజుల్లోనే మాగ్జిమం ఎంత రాబడుతుందో అంతా రాబట్టాలి. ఈ చిత్రం రూ.32 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English